చెల్లి పెళ్లి ఘనంగా చేయాలని ఆశపడ్డాడు ఆ అన్న. అందుకోసం మంచి సంబంధం చూసి వివాహాన్ని నిశ్చయించాడు.ఆర్మీలో పనిచేస్తున్న అతను ముహుర్తం దగ్గపడుతుండడంతో సెలవులపై ఇంటికొచ్చాడు. రాగానే ఆనందంతో చెల్లి పెళ్లి పనులు మొదలు పెట్టాడు. చుట్టాలకు, బంధువులకు ఆహ్వానించే పనిలో బిజీ బిజీ అయిపోయాడు. ఈ క్రమంలోనే కార్డులు పంచడానికి వెళ్తూ గత నెల 21న మండల పరిధిలోని కమ్మదనం వద్ద బైకు అదుపుతప్పి తీవ్రంగా గాయపడ్డాడు. పది రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పెళ్లి రోజే మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపుతోంది.
షాద్ నగర్ పరిధిలోని కంసాన్ పల్లికి చెందిన ఇప్పటూరు సత్యమ్మ సత్తయ్య దంపతులకు ముగ్గురు సంతానం. వీరిలో పెద్ద కొడుకు శ్రీనివాస్ ఆర్మీ జవాన్ గా జమ్మూ కాశ్మీర్లో విధులు నిర్వహిస్తున్నారు. తన చెల్లికి పరిగికి చెందిన వ్యక్తితో వివాహం నిశ్చయించి.. మార్చి 1న ముహర్తం పెట్టారు. పెళ్లి కోసం గ్రామానికి వచ్చాడు. బంధువులకు ఆహ్వాన పత్రికలు పంచే సమయంలో గత నెల 21న మండల పరిధిలోని కమ్మదనం వద్ద బైకు అదుపుతప్పి తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం అతనిని గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందతూ బుధవారం మృతి చెందాడు. అయితే చెల్లెలు పెళ్లి జరిగిన రోజునే అన్న కన్ను మూయడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
శ్రీనివాస్ ఆస్పత్రిలో ఉండగానే చెల్లెలు శిరీష వివాహాన్ని.. పెద్దలు నిశ్చయించిన ముహుర్తానికి వరుడు స్వగ్రామంలో నిరాడంబరంగా వివాహం జరిపించారు. పెళ్లి తర్వాత శ్రీనివాస్ మరణవార్త విన్న కుటుంబసభ్యులు, బంధువులు శోకసముద్రంలో మునిగిపోయారు. శ్రీనివాస్ మృతదేహానికి ఆర్మీ అధికారులు పాల్గొని అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.