Brothers Celebrates The Rakhi With Sister Statue In Kakinada District
mictv telugu

సోదరి విగ్రహం.. ఏపీలో ఎమోషన్ రాఖీ స్టోరీ..

August 12, 2022

Brothers Celebrates The Rakhi With Sister Statue In Kakinada District

రోడ్డు ప్రమాదంలో దూరమైన తమ చెల్లెలిని.. నిత్యం కళ్లముందే చూసుకోవాలని ఆ అన్నదమ్ములు పరితపించాడు. తోబుట్టువు విగ్రహాన్ని తయారు చేయించి.. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆవిష్కరించారు. కాకినాడ జిల్లా శంఖవరం మండలం కత్తిపూడి గ్రామానికి చెందిన మ‌ణి(29) 7 నెల‌ల క్రితం ప్ర‌మాదంలో మృతి చెందింది. ఆమెకు భ‌ర్త.. ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. గతంలో బైక్‌పై ప్రయాణిస్తుండగా వెనుక చక్రంలో చున్నీ ఇరుక్కుని ఆమె ప్రమాదం బారిన పడి మృతి చెందింది. అకస్మాత్తుగా ఆమె మృతి చెందడంతో కుంగిపోయిన అన్న‌ శివ‌, త‌మ్ముడు రాజా, అక్క వ‌ర‌ల‌క్ష్మీల‌కు ఓ ఆలోచ‌న వ‌చ్చింది.

తమ సోదరిలా ఎవరికీ జరగకూడదని సోషల్‌ మీడియాలో ప్రచారం నిర్వహించాడు తమ్ముడు రాజా. అలాగే తన అక్కను నిత్యం కళ్లెదుటే చూసుకోవాలనే ఉద్దేశంతో తాడేపల్లిగూడెంలో శిల్పివద్ద ఆమె విగ్రహాన్ని తయారు చేయించాడు. రాఖీ పౌర్ణమి సందర్భంగా కత్తిపూడిలో ఊరేగింపు నిర్వహించి తన సోదరి ఇంటి వద్దే విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. అంతే కాదు ఇంటి బయట అక్క ఫ్లెక్సీ కూడా పెట్టారు. ‘ఆడపడుచులు అందరూ బైక్ మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి.. నా చెల్లి బైక్ ప్రమాదంలో మరణించింది. ఆమెలా ఎవరికీ జరగకూడదు’ అంటూ రాసి పెట్టిన ఫ్లెక్సీ అందరినీ కంట తడి పెట్టిస్తుంది. తాము ప్రతి ఏటా రాఖీ పండుగను ఎంతో ఆనందంగా జరుపుకునే వాళ్లమని.. కానీ మణి లేని లోటు తీర్చలేనిది అంటున్నారు. అందుకే ఆమెను తలుచుకుంటూ విగ్రహం ఏర్పాటు చేసుకున్నామన్నారు. బైక్‌పై ప్రయాణించేటప్పుడు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.