అంబర్‌పేటలో దారుణం.. తమ్ముణ్ని ఉరితీసిన అన్న
హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. తరుచూ గొడవ పడుతున్నాడనే కోపంతో సొంత తమ్ముడినే ఉరేసి చంపాడు ఓ వ్యక్తి. అంబర్‌పేట చెన్నారెడ్డి నగర్‌లో మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉండగా.. వారు విడిపోయి వేరుగా ఉంటున్నారు. ఉరేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారణ జరపగా ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
షాహిద్ అనే వ్యక్తికి మహ్మద్ మునావర్ (32) అనే తమ్ముడు ఉన్నాడు. పదేళ్ల క్రితం స్థానికంగా ఉండే కల్పన అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తరుచూ గొడవలు జరగడంతో రెండేళ్ల క్రితం వీరిద్దరూ విడిపోయారు. ఈ క్రమంలో అతడు తాగుడుకు బానిసయ్యాడు. తరుచూ మద్యం మత్తులో అన్న షాహిద్‌తో గొడవ పడే వాడు. అతని చేష్టలతో విసిగిపోయిన షాహిద్ తమ్ముడి అడ్డు తప్పించుకోవాలని అనుకున్నాడు. మంగళవారం తెల్లవారుజామున ఒంటి గంట సమయంలో మద్యం మత్తులో ఉన్న మునావర్‌కు తాడుతో ఉరి బిగించాడు. ఊపిరాడకపోవడంతో అతడు అక్కడికక్కడే మరణించాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దీనిపై విచారణ ప్రారంభించారు.