అపురూపం.. అమరుడి చెల్లి పెళ్లి చేసిన 100 మంది జవాన్లు.. - MicTv.in - Telugu News
mictv telugu

అపురూపం.. అమరుడి చెల్లి పెళ్లి చేసిన 100 మంది జవాన్లు..

June 14, 2019

Brothers in arms! Garud commandos fill martyr JP Nirala’s shoes, make newly-married sister walk on their palms

దేశ రక్షణలో ప్రాణాలు కోల్పోయాడు ఓ వీర జవాన్. దీంతో ఆ కుటుంబంలో తీరని విషాదం అలుముకుంది. ముఖ్యంగా తన అన్న చనిపోవడంతో ఆ చెల్లి ఎంతో బాధపడింది. తన చేతుల మీదుగా చెల్లి పెళ్లిని ఘనంగా జరిపిస్తానని మాటిచ్చిన అన్న దేశం కోసం ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆ చెల్లి పెళ్లే చేసుకోవద్దనుకుంది. కానీ, ఆమెకు అన్నకు బదులు వంద మంది అన్నలు వచ్చి ఆ చెల్లి పెళ్లిని అత్యంత ఘనంగా జరిపారు. వారంతా తన అన్నతోటి వీర జవాన్లే. బిహార్‌లోని బదిలాడీలో జరిగింది.

జ్యోతి ప్రకాశ్ నిరాలా 2017లో దేశ సరిహద్దుల్లో వీర మరణం చెందారు. దీంతో ఆయన చెల్లెలు చంద్రకళ పెళ్లి తొడబుట్టిన అన్న లేకుండా ఎలా చేసుకోవాలనుకుంది. అయితే ఈ పెళ్లివేడుకను అమరవీరుడైన జ్యోతి ప్రకాశ్ నిరాలా సహచరులు అత్యంత ఆడంబరంగా జరిపించారు. 100 మంది గరుడ కమాండోలు వచ్చి ఆ చెల్లికి అన్నలేని లోటు తెలియకుండా ఈ పెళ్లిని దగ్గరుండి జరిపించారు. వారి కుటుంబ సంప్రదాయం ప్రకారం అన్నయ్య చేతిలో చెల్లెలు అడుగు వేసుకుంటూ నడవాలి. అలా.. సైనికులు తమ చేతులను మెత్తని పానుపు చేశారు. ఆమెను తమ చేతులపై నడిపించి ఘనంగా వివాహం జరిపించారు. ఈ దృశ్యం చూసి అక్కడ చాలా మంది భావోద్వేగానికి లోనయ్యారు. వ్యక్తిగతంగా రూ.5లక్షలు సేకరించి ఆ కుటుంబానికి ఇచ్చారు.

ఈ సందర్భంగా చంద్రకళ, ఆమె తండ్రి ఆనందంతో ఉప్పొంగిపోయారు. దేశానికి తాను ఒక్క కొడుకును ఇస్తే.. ఇపుడు 100మంది కొడుకులు తమ కుటుంబంలో ఎనలేని సంతోషం నింపారంటూ జ్యోతి ప్రకాశ్ నిరాలా తండ్రి హర్షం వ్యక్తం చేశారు.

కాగా, జ్యోతి ప్రకాశ్ నిరాలా ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో గరుడ కమాండోగా పనిచేశారు. 2017 నవంబర్‌లో జమ్ముకశ్మీర్‌లోని బండిపొరాలో ఉగ్రవాదులతో పోరాడుతూ వీరమరణం పొందారు. ఈ పోరులో ఐదుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టింది ఎయిర్ ఫోర్స్ బృందం. ఆరో ఉగ్రవాది జరిపిన కాల్పుల్లో నిరాలా నేలకు ఒరిగారు. 2018లో రాష్ట్రపతి జ్యోతి ప్రకాశ్ నిరాలాకు అశోకచక్ర బిరుదును కూడా ప్రకటించారు.