మహిళా రిజర్వేషన్ బిల్లు మన కాలపు అవసరమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. చట్టసభలతోపాటు అన్ని రంగాల్లోనూ స్త్రీలకు సమాన ప్రాతినిధ్యం ఉంటేనే సమాజం ముందుకు వెళ్తుందని, సమానత్వ ఆకాంక్ష నెరవేరుతుందని ఆమె అన్నారు. బుధవారం ఢిల్లీలో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రాధాన్యంపై ఆమె రౌంట్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కవిత మాట్లాడుతూ, ‘‘మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం మేం పోరాడుతూనే ఉంటాం. కలిసి వచ్చే అందరీతో చిత్తుశుద్ధితో పనిచేస్తాం.
స్త్రీలకు నేటి రాజకీయాల్లో సమాన అవకాశాలు లేవు. మా పార్టీతో సహా ఎవరూ ఎక్కువ అవకాశాలు ఇవ్వడం లేదు. ఈ పరిస్థితి మారాలి. అందుకే చాలా పార్టీలు ఈ బిల్లు కోసం తమవంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇది ఒకరోజుతో ముగిసే పోరాటం కాదు. పార్లమెంట్‌లో బిల్లు కోసం ఒత్తిడి తెస్తాం. ప్రైవేటు బిల్లులతో ఏమవుతుందని నిరాశపడం. ఏ పోరాటమైనా తొలి అడుగుతోనే మొదవుతుంది’’ అని ఆమె చెప్పారు.
ఢిల్లీ లిక్కర్ కేసులో గురువారం ఈడీ ఎదుట తప్పకుండా హాజరవుతానని, అంతకు ముందు మీడియాతో మాట్లాడతానని ఆమె చెప్పారు.
కవితను ఈ నెల 10న ఈడీ తొలిసారి విచారించడం తెలిసిందే. ఈ నెల 16న మళ్లీ హాజరుకావాలని చెప్పింది. దీంతో ఆమెతోపాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు ఢిల్లీ చేరుకున్నారు. విచారణ అనంతరం కవితను అరెస్ట్ చేస్తారని వార్తలు వస్తున్నాయి. అదే నిజమైతే వెంటనే బెయిల్ పిటిషన్ వేసి బయటికి తెప్పించాల పార్టీ కసరత్తు చేస్తోంది.