దేశంలో ఎంతో విలువైన దేశసంపద, సహజ వనరులు ఉన్నా ఎందుకూ కొరగాకుండా పోతున్నాయని తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. విశాల భూభాగం, చక్కని వాతావరణం, అపార జలవనరులు ఉన్న దేశంలో దరిద్రమెందుకుందని ప్రశ్నించారు. ప్రపంచంలోనే ఆహారోత్పత్తిలో అగ్రగామిగా ఉండాల్సిన దేశం పామాయిల్, కందిపప్పును కెనడా తదితర దేశాలను నుంచి దిగుమతి చేసుకోవడం సిగ్గుచేటు కాదా? దీనికెవరు బాధ్యులు అని ప్రశ్నించారు. బుధవారం ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ తొలి బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.
‘‘70వేల టీఎంసీలు నీరు అందుబాటులో ఉంటే వాడుకుంటున్నదెంత? దేశానికి ఒక లక్ష్యం ఉందా? స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో వేసిన ప్రణాళికలు, కట్టిన ప్రాజెక్టులు తప్ప తర్వాత అతీగతీ లేదు. ట్రిబ్యునళ్లతో ఏళ్లు గడిచినా ప్రయోజనం ఎందుకు లేదు? లక్షల కోట్ల సంపద ఉన్నా దేశ ప్రజలు ఇంకా యాచకులుగానే ఉన్నారెందుకు? నిరుపేద ఆఫ్రికా దేశాలతోపాటు చైనా, అమెరికాల్లో వేల వందల టీఎంసీల ప్రాజెక్టులు ఉన్నాయి. మనదేశంలో మరి ఇలాంటివెక్కడ? మనం శాశ్వతంగా నీళ్లు లేక బాధపడాల్సిందేనా? నదుల్లోని నీళ్లు భూములపైకి రావాలా వద్దా? కరువుతో అల్లాడాలా? అక్కర్లేదు. నీళ్లు భూమిపై పారాలి. దీన్ని సాధించడానికే బీఆర్ఎస్ పార్టీ ఫుట్టింది. సహజ సంపదను వాడుకోడానికి పోరాటం జరగాలి’’ అని కేసీఆర్ అన్నారు. చాట్లో తవుడు పోసి కుక్కల మధ్య కొట్లాట పెట్టినట్లు రాష్ట్రాల మధ్య గొడవలు పెట్టి వనరులను వృథా చేస్తారా అని ప్రశ్నించారు. సంకల్పం ఉంటే కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టులు వంటి సాకారం అవుతాయని, భారతజాతి విముక్తి కోసమే బీఆర్ఎస్ పుట్టిందన్నారు.