ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్ ను మంత్రి కేటీఆర్ ఖండించారు. ప్రతిపక్షపార్టీలపై తన పరిధిలోని ఏజెన్సీలను బీజేపీ ఉసిగొల్పుతోందని విమర్శించారు. సిసోడియా అరెస్ట్ పూర్తిగా అప్రజాస్వామికమని కేటీఆర్ మండిపడ్డారు. బీజేపీ ఓడిపోయిన రాష్ట్రాల్లో దొంగ చాటు రాజకీయాలకు తెరలేపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే దేశంలో 9 రాష్ట్రాల ప్రభుత్వాలను కూల్చిన అప్రజాస్వామిక పార్టీ బీజేపీ అని ఆరోపణలు చేశారు. ఆప్ పార్టీని బలహీనపరిచే కుట్రలో భాగంగా సిసోడియాను అరెస్ట్ చేశారని తెలిపారు. నీతిలేని దుర్మార్గపు రాజకీయాలు చేస్తున్న బీజేపీని ప్రజలు తిప్పికొడతారని హెచ్చరించారు. ఢిల్లీ మేయర్ ఎన్నికల్లో సుప్రీంకోర్టులో చివాట్లు తిన్న తర్వాతఎదురైనా పరాజయాన్ని తట్టుకోలేకే ఇప్పుడు సిసోడియాను అరెస్ట్ చేశారన్నారు. బీజేపీ అసమర్ధ పాలనను..అవినీతిని ప్రశ్నిస్తున్న పార్టీలను ఎదుర్కోలేక పిరికి రాజకీయాలు చేస్తుందని కేటీఆర్ ధ్వజమెత్తారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆదివారం మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసింది. సుమారు 8 గంటలు ఆయన ప్రశ్నల వర్షం కురిపించిన సీబీఐ అధికారులు అనంతరం అదుపులోకి తీసుకున్నారు.నేడు మనీష్ సిసోడియాను కోర్టులో హాజరు పరిచి కస్టడీ కోరనుంది సీబీఐ. సిసోడియా అరెస్ట్‌ను ఆప్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. కేంద్రం మురికి రాజకీయాలు చేస్తుందని ఢిల్లీ సీఎం,ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ మండి పడ్డారు.మనీశ్ సిసోడియా (Manish Sisodia) ను అరెస్ట్ చేయడంతో ప్రజల్లో ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తుతున్నాయి అని తెలిపారు. మా పోరాటం మరింత బలోపేతం అవుతుందంటూ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.