త్వరలో జరగనున్న MLC ఎన్నికల్లో హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి MIM పార్టీకి బీఆర్‌ఎస్ ప్రభుత్వం మద్దతు పలికింది. గతంలో ఈ సీటు MIM కు చెందినదే. అంతకుముందు కూడా బీఆరెస్ మద్దతుతోనే ఎంఐఎం ఈ స్థానంలో గెలుపొందింది. ఈ సారి కూడా ఆ స్థానానికి తమకు మద్దతు ఇవ్వవలసిందిగా MIM పార్టీ చేసిన విజ్ఞప్తిపై సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. పార్టీలో చర్చించిన తర్వాత హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ అభ్యర్థికి సంపూర్ణ మద్దతు పలకాలని కేసీఆర్ నిర్ణయించారు.
ఈ ఏడాది మార్చి 13వ తేదీన రాష్ట్రంలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంతోపాటు హైదరాబాద్ -రంగారెడ్డి- మహబూబ్ నగర్ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం నుండి MIMకి చెందిన సయ్యద్ హసన్ జాఫ్రీ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. జాఫ్రీ పదవీకాలం ఈ ఏడాది మే 1వ తేదీతో ముగియనుంది. దీంతో ఈ స్థానానికి ఎన్నికలు నిర్వహించాలని ఈసీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది.
గత తొమ్మిదేళ్లుగా బీఆర్ఎస్ కు ఎంఐఎం మద్దతు తెలుపుతూ వస్తోంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కూడా మజ్లిస్ మద్దతుతోనే బీఆర్ఎస్ గట్టెక్కింది. ఈ క్రమంలో ఎమ్మెల్సీ సీటును ఎంఐఎంకే కేసీఆర్ అప్పగించారని విశ్లేషకులు అంటున్నారు. ఇటీవల మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ కేసీఆర్ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించడం వెనుక అసలు కారణం ఇదేనని అంటున్నారు. ముస్లిం ఓట్లు చీలిపోతే బీఆర్ఎస్ కు కూడా నష్టం కలిగే అవకాశముంది.