అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో ప్రధాన పార్టీలు వ్యూహాలను రూపొందించుకోవడానికి కసరత్తు ప్రారంభించాయి. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు విస్తృత ప్రచారమే ఆయుధంగా ప్రజల్లోకి వెళ్లడానికి అన్ని శక్తులను ఒడ్డుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, వైఎస్సార్ తెలంగాణ పార్టీ నేతలు ఇప్పటికే యాత్రలు చేస్తున్నాయి. బీఆర్ఎస్ కూడా వాటికి దీటుగా ప్రచారానికి రూపకల్పన చేస్తోంది.
పార్టీ పేరు మార్చుకుని జాతీయగా పార్టీగా మారిన నేపథ్యంలో ఎన్నికలతోపాటు సంస్థాగత, ప్రభుత్వ పథకాలు, అమలు వంటి అనేక అంశాలపై చర్చించడానికి గులాబీ దళం ఈ నెల 10న(శుక్రవారం) కీలక సమావేశం నిర్వహిస్తోంది. మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్‌లో పార్టీ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ భేటీ ఉంటుంది. ఇందులో పార్లమెంటరీ, లెజిస్లేటివ్ విభాగాల, రాష్ట్ర కార్యవర్గాల సంయుక్త సమావేశం నిర్వహిస్తారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్యవర్గం, జిల్లాల పార్టీ అధ్యక్షులు , జిల్లా పరిషత్ చైర్మన్లు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్, చైర్ పర్సన్లు, డిసిఎమ్ఎస్, డి సిసిబి చైర్మన్, చైర్ పర్సన్‌లు పాల్గొంటారు. ఆహ్వానితులందరూ ఈ సమావేశానికి తప్పకుండా హాజరు కావాలని కేసీఆర్ సూచించారు.