బీఆర్ఎస్ పేరుతో జాతీయ పార్టీగా మారిన టీఆర్ఎస్లో ఉన్నట్టుండి కలకలం రేగింది. అవినీతి ఆరోపణల్లో చిక్కుకున్న మంత్రి మల్లారెడ్డిపై మేడ్చల్-మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాలకు చెందిన పలువురుఎమ్మెల్యేలు రెబల్ జెండా ఎగరేశారు. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఇంట్లో సోమవారం భేటీ అయ్యారు. తర్వాత విలేకర్ల సమావేశంలోనూ మాట్లాడారు. తమది రహస్య భేటీ కాదని, పార్టీ విషయాలు, పదవుల పంపకాలపై చర్చించడానికే సమావేశమయ్యామని చెప్పారు. అయితే లోలోపల అగ్గి రాజుకుంటోందని వారి మాటలను బట్టి అర్థమవుతోంది. ‘మల్ల’గుల్లాల భేటీలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. మంత్రి మల్లారెడ్డిపై తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన తమ నియోజకర్గాల్లో వేలుపెడుతున్నారని, పదవులను తన అనుచరుల కోసం గద్దలా తన్నుకుపోతున్నారని మండిపడ్డాడారు. ఇటీవల భారీ స్థాయిలో ఐటీ దాడులు ఎదుర్కొన్న మల్లారెడ్డికి సొంతపార్టీ ఎమ్మెల్యేలే ఎదురుతిరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.
అన్నీ ఎత్తుకుపోతున్నాడు..
‘‘ఇది రహస్య సమావేశం కాదు. మా ఇంటి సమస్య. కుత్బుల్లాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాం’’ అని వివేకానంద గౌడ్ చెప్పారు. పదవులన్నీ ఒకే నియోజకవర్గానికి, సామాజిక వర్గానికి వెళ్తున్నాయని, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారని కృష్ణారావు అన్నారు. మల్లారెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అర్హులకు నామినేటెడ్ పదవులు దక్కడం లేదని గాంధీ వాపోయారు. అయితే ఈ అసంతృప్తి అధినేత కేసీఆర్కు తెలియదా అనే సందేహాలు వస్తున్నాయి. ఆదివారం జరిగిన ఓ పెళ్లిలో అసంతృప్త ఎమ్మెల్యేలకు, మల్లారెడ్డికి మధ్య ఈ విషయంపై పెద్ద గొడవ జరిగినట్లు తెలుస్తోంది. తాము చెప్పిన పనులు చేయొద్దని మల్లారెడ్డి కలెక్టరుకు చెప్పారని, దీంతో ఎమ్మెల్యేలు ఆయనపై కోపంగా ఉన్నారని సమాచారం. మల్లారెడ్డి ఆధిపత్యాన్ని అడ్డుకోవాలంటే ఏదో ఒకటి చెయ్యాలనే భేటీ అయినట్లు సమాచారం.
అబ్బే.. తెలియదే..
తనపై ఎమ్మెల్యేల విమర్శలకు మల్లారెడ్డి వెంటనే స్పందించారు. గద్వాల జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. తాను హైదరాబాద్ వెళ్లి విషయమేమిటో తెలుసుకుంటానని అన్నారు. భేటీ గురించి తనకు మీడియా ద్వారానే తెలిసిందన్నారు. మరోవైపు.. సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు ఈరోజు(సోమవారం) సాయంత్రం తనను కలవాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
అదృష్టం కలిసొచ్చి రోహిత్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యాడు.. రఘునందన్ రావు