BRS Leader Surprise For MLC Kavitha With Variety Birthday Wishes
mictv telugu

BRS MLC కవితకు బర్త్ డే విషెస్.. కాస్త వెరైటీగా సముద్రం అడుగుభాగంలో

March 13, 2023

BRS Leader Surprise For MLC Kavitha With Variety Birthday Wishes

తమ అభిమాన రాజకీయ నాయకులు, సినీ నటులు బర్త్ డేల నాడు ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. వారిపై తమ అంతులేని అభిమానాన్ని ప్రదర్శించేందుకు రకరకాల పనులు చేస్తుంటారు. కొందరు అన్నదానాలు, రక్తదానాలు చేస్తే.. మరికొందరు విశాలమైన స్థలంలో మొక్కలతో, లేదంటే ఏదైనా ధాన్యపు గింజలతో వారి చిత్రపటాలను తీర్చిదిద్దుతారు.

తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పుట్టినరోజును పురస్కరించుకుని ఆ పార్టీ అభిమానులు, సోషల్‌ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో నిజామాబాద్‌కు చెందిన బీఆర్ఎస్ నాయకుడు చిన్ను గౌడ్ వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపి తన అభిమానాన్ని చాటుకున్నారు. అండమాన్ నికోబార్ దీవుల్లో బంగళాఖాతం సముద్రపు అంచుల్లోకి వెళ్లి జన్మదిన శుభాకాంక్షలతో కూడిన బ్యానర్లను ప్రదర్శించారు.

నీటి అడుగున డైవింగ్ చేస్తూ ‘హ్యపీ బర్త్ డే కవిత అక్క’ అని రాసి ఉన్న బ్యానర్లను ప్రదర్శించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మరికొన్ని జెండాలపై కల్వకుంట్ల ‘కవితకు జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ బ్యానర్లు ప్రదర్శించి తమ ప్రత్యేకతను చాటుకున్నారు. సముద్రం దిగువన ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకొని అటూ ఇటూ తిరుగుతూ ఈ బ్యానర్లతో సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియోను టీఎస్ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ విడుదల చేసారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.