BRS leaders are making huge arrangements in the wake of the BRS public meeting in Khammam.
mictv telugu

భారీ కటౌట్లు, హోర్డింగులు.. ఖమ్మం.. గులాబీమయం

January 17, 2023

ఖమ్మంలో బీఆర్‌ఎస్ భారీ బహిరంగ సభ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఖమ్మంలో ఈ నెల 18న కనీవినీ ఎరగని స్థాయిలో బహిరంగ సభ నిర్వహించేందుకు బీఆర్‌ఎస్‌ పార్టీ భారీ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. దేశం మెచ్చేలా సభకు సన్నాహాలు చేస్తోంది. సభకు రెండు రోజుల ముందే ఖమ్మం నగరం భారీ కటౌట్లు, హోర్డింగ్‌లతో ఎటుచూసినా.. గులాబీ మయంగా మారింది. సభా స్థలికి అన్నివైపులా సుమారు 5 కిలోమీటర్ల మేర గులాబీ జెండాలు రెపరెపలాడుతున్నాయి. జాతీయ రహదారి, అన్ని ప్రధాన రోడ్లు కళకళలాడుతున్నాయి. ఖమ్మం ప్రధాన రోడ్ల పొడువునా వివిధ పార్టీల నేతల ఫొటోల కలయికతో సీఎం కటౌట్ చూస్తుంటే.. రాబోయే రోజుల్లో సరికొత్త జాతీయ రాజకీయ పార్టీల కూర్పుకు అంతా అనుకూలంగానే ఉన్నట్లు సంకేతాలిస్తోంది.

ఈ సభకు సుమారు 5 లక్షల మంది జనసమీకరణ చేయాల్సిందిగా సీఎం కేసీఆర్‌ ఇప్పటికే పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేశారు. ఖమ్మం నూతన కలెక్టరేట్ వెనుక నిర్వహిస్తున్న ఈ భారీ బహిరంగ సభ కోసం 100 ఎకరాలు సిద్ధం చేశారు. సభా వేదికను ఆధునిక హంగులతో ముస్తాబు చేస్తున్నారు. జర్మన్ టెక్నాలజీతో వాటర్, ఫైర్ ఫ్రూఫ్‌తో వేదికను రూపొందించారు. మొత్తం 200 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. 448 ఎకరాల్లో 20 ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాలు సిద్ధం చేశారు. బహిరంగ సభలో 50 ఎల్ఈడీ తెరలు, 100 మొబైల్ టాయ్‌లెట్స్‌ ఏర్పాటు చేశారు. 8 లక్షల మజ్జిగ సహా.. నీటి ప్యాకెట్లు అందుబాటులో ఉంచుతున్నారు. వెయ్యి మంది వాలంటీర్లు సభలోని గ్యాలరీల్లో విధులు నిర్వర్తించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు దిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్సింగ్ మాన్, పినరయి విజయన్‌తో పాటు యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా, పలువురు జాతీయ నాయకులు హాజరుకానున్నారు. జాతీయ స్థాయిలో రాజకీయాలను తనవైపు తిప్పుకునేలా కేసీఆర్ అత్యంత పగడ్బందీగా బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ఢిల్లీ, పంజాబ్ సీఎంలకు ప్రొటోకాల్ ప్రకారం హోంమంత్రి మహమూద్‌ అలీ, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, దాసోజు శ్రవణ్ స్వాగతం పలుకుతారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సభ జరగనుంది. సభలో ముఖ్య అతిథుల తర్వాత చివరగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగిస్తారు.