తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి జోకర్, బ్రోకర్, బ్లాక్ మెయిలర్ అని బీఆర్ఎస్ నేతలు దుమ్ముత్తి పోశారు. రేవంత్ తన పాదయాత్రలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు సంధిస్తుండడంతో బుధవారం బీఆర్ఎస్ ఎల్పీ కార్యాయంలో విలేకర్ల సమావేశం నిర్వహించి నిప్పులు చెరిగారు. ఇందులో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. రేవంత్ కేవలం పబ్లిసిటీ స్టంట్ చేయడానికే పాదయాత్ర చేస్తున్నాడని, జనం అతన్ని తన్ని పంపిస్తారని అన్నారు.
‘‘స్థాయి లేని వాడికి పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చారు. ప్రగతి భవన్‌ను పేల్చాలని నక్సలైట్లకు పిలుపివ్వడం దుర్మార్గం. అతడు నక్సలైట్ల భుజం మీద తుపాకీ పెట్టి కాలుస్తున్నాడు. క్షమాపణ చెప్పకపోతే ఆయన పాదయాత్ర మానుకోట దాటదు’’ అని సత్యవతి రాథోడ్ హెచ్చరించారు. రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ ఖతమవుతుంద ఎర్రబెల్లి అన్నారు. ‘‘రేవంత్ సినిమాలో ఐటెం సాంగ్ లాంటివాడు. అది పాదయాత్రలా లేదు. పాదయాత్ర అంటే నడవాలి. రాహుల్ నడిచారు.. రేవంత్ కొంత దూరం నడిచి కారెక్కుతున్నారు. అతడు ఓ బ్రోకర్, జోకర్. రేవంత్ టీడీపీలో నా కింద పని చేసినపుడు పద్ధతి మార్చుకోమని చెప్పాను. అతనికి ఇంగిత జ్ఞానం లేదు. నేను ఇంటర్ దాకా చదువుకున్నా. నాకు చదువు పెద్ద గా లేకపోవచ్చు. కానీ రేవంత్ గాడిలా నేను దొంగను కాదు, బ్లాక్ మెయిలర్ ను కాదు. ప్రజాభిమానం లేకపోతే నేను ఏడు సార్లు ఎందుకు గెలుస్తాను? రేవంత్ పై చర్యలు తీసుకోకుంటే కాంగ్రెస్‌కే నష్టం’’ అని అన్నారు.