ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి మరోసారి ఈడీ విచారణకు హాజరుకానున్నారు. మంగళవారం 10.30 గంటలకు ఈడీ కార్యాలయంలో జరిగే విచారణకు హాజరుకానున్నారు. నిన్న రోహిత్ రెడ్డిని ఈడీ అధికారులు 6 గంటలపాటు విచారించారు. నిన్న తన వ్యక్తిగత వివరాలు, వ్యాపార లావాదేవీలపై అడిగారని చెప్పుకొచ్చారు రోహిత్‌రెడ్డి. విచారణ అనంతరం హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయం వద్ద రోహిత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈడీ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం చెప్పానన్నారు. నీ పేరేమిటి? కుటుంబ సభ్యుల పేర్లేమిటి? వాళ్లేం చేస్తుంటారు? ఎక్కడెక్కడ ఉంటారు? ఇలాంటి ప్రశ్నలు మాత్రమే ఈడీ అధికారులు పదే పదే అడిగారని చెప్పారు. తనను ఎందుకు పిలిచారు? ఏ కేసులో పిలిచారు? తనపై వచ్చిన ఫిర్యాదు ఏమిటి? అని తానే అధికారులను అడిగానని, దానికి వారు ‘ప్లీజ్ కో ఆపరేట్.. వీ కాంట్ సే మోర్’ అని బదులిచ్చారని వివరించారు.
మంగళవారం ఉదయం 10.30 గంటలకు హాజరు కావాలన్నారని, అధికారులు కోరిన విధంగా హాజరవుతానని రోహిత్ రెడ్డి మీడియాకు తెలిపారు. ఈడీ విచారణ నేపథ్యంపై తమ న్యాయనిపుణులతో చర్చిస్తానని చెప్పారు. ఈ క్రమంలో ఈడీ అధికారులు ఇవాళ ఎలాంటి ప్రశ్నలు అడగబోతున్నారనేది ఉత్కంఠ రేపుతోంది. నిన్నటి విచారణలో ఈడీకి పూర్తిగా సహకరించానని, ఇవాళ కూడా ఈడీ అధికారులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెబుతానని వెల్లడించారు. కాగా, సోమవారం విఙ్ఞప్తులు.. తిరస్కరణ మధ్య ఈడీ తన పంతాన్ని నెగ్గించుకుంది. ఎలాంటి వాయిదా లేకుండా రావాల్సిందేనన్న ఈడీ ఆదేశాలను గౌరవించారు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి. మధ్యాహ్నం 3.21 నిమిషాలకు బషీర్‌బాగ్‌లోని ఈడీ ఆఫీస్‌కు వెళ్లారు. దాదాపు ఆరు గంటల పాటు విచారణ కొనసాగింది.