మీడియా ముందే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సర్పంచ్ నవ్య - Telugu News - Mic tv
mictv telugu

మీడియా ముందే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సర్పంచ్ నవ్య

March 13, 2023

BRS MLA Rajaiah seeks apology from woman sarpanch; says he's sorry too

ఎమ్మెల్యే రాజయ్య గత రెండేళ్లుగా తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం జానకీపురం సర్పంచి కె.నవ్య సంచలన ఆరోపణలు చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రాజయ్య ఆదివారం సర్పంచి నవ్య ఇంటికి వెళ్లారు. నవ్య దంపతులకు క్షమాపణలు చెప్పారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య సయోధ్య కుదిరినట్టు తెలుస్తోంది. అనంతరం నవ్య దంపతులతో కలిసి ఎమ్మెల్యే రాజయ్య మీడియా ముందుకు వచ్చారు.

కిరోసిన్ పోసి నిప్పంటిస్తా

సర్పంచి నవ్య మీడియాతో మాట్లాడుతూ, చెడును తాను ఖండిస్తానని తెలిపారు. ఎవరికైనా పార్టీలో విలువ ముఖ్యం అని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే రాజయ్య వల్లే తాను సర్పంచిని కాగలిగానని అన్నారు. రాజకీయాల్లో అణచివేతలు, వేధింపులు ఉండరాదని కోరుకుంటానని తెలిపారు. మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడితే సహించేది లేదని , పార్టీలో ఏ స్థాయిలో ఉన్న మహిళలకైనా గౌరవం ముఖ్యమని అన్నారు.

అంతకుముందు మీడియాతో తాను మాట్లాడిన ప్రతీ మాట నిజమేనని , వేధింపులకు గురి చేసే వారి భరతం పడతానని రాజయ్య ముందే ఘాటు వ్యాఖ్యలు చేశారు. పిచ్చి వేషాలు వేస్తే మహిళలను వేధిస్తే కిరోసిన్ పోసి నిప్పంటించేందుకు కూడా సిద్ధమేనని వార్నింగ్ ఇచ్చారు. రాజయ్యపై చేసిన ఆరోపణలు వెనక్కి తీసుకుంటారా అన్న ప్రశ్నకు మాత్రం స్పష్టమైన వివరణ ఇవ్వకుండా.. కుటుంబంలో ఎవరైనా తప్పుచేస్తే క్షమించాల్సిన పరిస్థితి ఉంటుందంటూ దాటవేసే ప్రయత్నం చేశారు. గ్రామానికి ఎలాంటి అభివృద్ధి చేస్తారో.. స్పష్టమైన హామీ ఇవ్వాల్సిందిగా రాజయ్యను కోరారు సర్పంచ్ నవ్య.

గ్రామానికి రూ.25 లక్షలు మంజూరు

ఇక రాజయ్య మీడియాతో మాట్లాడుతూ.. తనకు నలుగురు చెల్లెల్లు ఉన్నారని..తన ఒంట్లో ఊపిరి ఉన్నంత వరకు మహిళల ఆత్మగౌరవం కోసం కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు జరిగిన పరిణామాలకు తాను చింతిస్తున్నానని చెప్పారు. తెలిసో తెలియకో తప్పులు చేసి ఉంటే మహిళా లోకాన్ని క్షమాపణలు కోరుతున్నానని ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. జానకిపురం గ్రామాభిృద్ధికి సహకరిస్తానని ఎమ్మెల్యే రాజయ్య తెలిపారు. గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ఎమ్మెల్యే నిధుల నుంచి రూ. 25 లక్షలు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. అభివృద్థి అనేది నిరంతర ప్రక్రియ అని..జానకిపురం గ్రామ సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని సర్పంచ్ నవ్యప్రవీణ్ కు సూచించారు.