సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సాయన్న అంత్యక్రియలు అనూహ్య పరిణామంతో నిలిచిపోయాయి. మారేడుపల్లి శ్మశాన వాటికలో ఆయన అభిమానుల నిరసనతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేయాలంటూ వారు ఆందోళనకు దిగారు. సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వ పెద్దలు రంగంలోకి దిగారు.
సాయన్న పార్థివదేహాన్ని చితిపై ఉంచిన అభిమానులు అధికార లాంఛనాలతోనే అంతిమ సంస్కారం నిర్వహించాలని అభిమానులు పట్టుబట్టారు. సినిమావారికి పోలీసుల గౌరవ వందనంతో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారని, సాయన్న దళితుడైనందుకే అందుకు నిరాకరించారని ఆరోపించారు. కేసీఆర్‌కు, బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు నచ్చజెప్పినా పట్టించుకోలేదు. దీంతో పైస్థాయిలో మంతనాలు సాగుతున్నాయి. నిన్న ఆదివారం సెలవు కావడంతో అధికార లాంఛనాలకు సంబంధించి నిర్ణయం తీసుకోలేకపోయామని, సమస్యను పరిష్కరిస్తామని సర్కారు పెద్దలు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. సాయన్న ఆదివారం గుండెపోటుతో చనిపోయారు. డయాబెటిస్ వల్ల ఇన్‌ఫెక్షన్‌తో ఎడమ కాలు కోల్పోయిన ఆయన డయాలసిస్ కూడా చేయించుకున్నారు. ఆయనకు భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.