బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. ఓ మహిళా సర్పంచ్ సంచలన ఆరోపణలు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. తనను రమ్మని రాజయ్య పిలిచారని సర్పంచ్ నవ్య మీడియా ముందు కన్నీరుమున్నీరయ్యింది. అయితే ఇది రాజకీయ కుట్రేనని ఎమ్మెల్యే రాజయ్య తీవ్రంగా కొట్టి పారేశారు.
లైంగికంగా, మానసికంగా వేధిస్తున్నారు : నవ్య
హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని జనకీపురం సర్పంచ్ నవ్య మీడియా ముందుకు వచ్చి తనకు జరిగిన అన్యాయాన్ని వెల్లడించింది. తనను రాజయ్య లైంగికంగా, మానసికంగా వేధిస్తున్నారని ఘాటు ఆరోపణలు చేసింది. ఈ వార్త ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది. షాపింగ్ పేరుతో తనను రాజయ్య పిలుస్తున్నాడని నవ్య ఆరోపించింది. తనతో బయటికి వస్తే బంగారం, డబ్బు ఇస్తానని ప్రలోభపెడుతున్నారని కన్నీరుమున్నీరయ్యింది. భర్తను తనతో పాటు తీసుకురాకూడదని చెబుతున్నారని, తన భర్తను అవమానిస్తున్నారని ఆరోపించింది. ఎమ్మెల్యే రాజయ్య ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతున్నారని, తన అనుచరులు వేధిస్తున్నారని చెప్పుకొచ్చింది. రాజకీయ ఎదుగుదల కావాలంటే రాజయ్య చెప్పినట్లు విను అని మహిళలతో ఫోన్ చేయిస్తున్నారని తెలిపింది. తననే కాదు రాజయ్య మిగతా మహిళా ప్రజాప్రతినిధులను వేధిస్తున్నారని వెల్లడించింది. ఇందుకు తగిన ఆధారాలు తన దగ్గర ఉన్నాయన్న నవ్య సీఎం కేసీఆర్, కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తానని పేర్కొంది.
నాపై కుట్ర చేస్తున్నారు : రాజయ్య
తనపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని ఎమ్మెల్యే రాజయ్య కొట్టి పారేశారు. ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో కావాలనే కొంత మంది తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానన్నారు రాజయ్య.