ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ దర్యాప్తుపై సందేహాలు వ్యక్తం చేశారు. ఈ కేసులో నిష్పాక్షిక విచారణ జరపాలని దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ఈమేరకు ఆమె న్యాయవాదులు కపిల్ సిబల్, విక్రమ్ చౌదురిలు కోర్టును కోరారు. కుంభకోణంపై ఈడీతో కాకుండా.. కోర్టు పర్యవేక్షణలో విచారన జరపానికి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేయాలని ఆమె కోరారు.
ఒక మహిళగా తనకున్న హక్కులను ఈడీ అధికారులు ఖాతరు చేయడం లేదని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
‘‘సాక్షిగా పిలిచిన మహిళను ఇంటి వద్దగాని, లేకపోతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించాలి. అయితే సీఆర్పీసీ సెక్షన్ 160ని ఉల్లంఘించ నన్ను ఈడీ కార్యాలయానికి పిలిపిచుంచుకుని ప్రశ్నిస్తున్నారు.
నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. నా లాయర్ల సమక్షంలో, సీసీ టీవీ కెమెరాల ముందు విచారణ జరగాలి’’ అని ఆమె కోరారు. అసలు ఈ కేసులో కవితకు ఇచ్చిన ఈడీ సమన్లే చెల్లవని వాటిని, రద్దు చేయాలని ఆమె న్యాయవాదులు కోర్టులో వాదించారు. కాగా, ఈ కేసు చాలా తీవ్రమైందని సుప్రీం తమను సంప్రదించకుండా తదుపరి ఆదేశాలు ఇవ్వొద్దని ఈడీ కూడా కోర్టును కోరింది.
వాదనలు విన్న కోర్టు విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఢిల్లీ మద్యం లైసెన్సుల కేటాయింపు కోసం కవిత ప్రమోటర్‌గా భావిస్తున్న సౌత్ గ్రూప్ కంపెనీ ఆప్ నేతకు 100 కోట్ల ముడుపులు చెల్లించిందని ఈడీ, సీబీఐలు ఆరోపిస్తుండడం తెలిసిందే.
ఈ కేసులో నిందితులతో ఆమె మంతనాలు జరిపారని, సాక్ష్యాలు దొరక్కుండా ఫోన్లు పగలగొట్టారని దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. సీబీఐ ఆమెకు ఇప్పటికే ఒకసారి, ఈడీ మూడుసార్లు విచారించాయి.