‘కేసీఆర్, బీఆర్ఎస్‌ను లొంగదీసుకోవడం మీ తరం కాదు’ - Telugu News - Mic tv
mictv telugu

‘కేసీఆర్, బీఆర్ఎస్‌ను లొంగదీసుకోవడం మీ తరం కాదు’

March 8, 2023

BRS MLC Kavitha responded to the notices issued by the Enforcement Directorate.

ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్(ఈడీ) జారీ చేసిన నోటీసుల‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత స్పందించారు. చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా దర్యాప్తు సంస్థలకు పూర్తిస్థాయిలో సహకరిస్తానని, కానీ ధర్నా, ముందస్తు అపాయింట్‌మెంట్ల‌ రీత్యా విచారణకు హాజరయ్యే తేదీపై న్యాయ సలహా తీసుకుంటానని ఆమె తెలిపారు. ఈ మేర‌కు ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

రాజకీయ రంగంలో తగిన ప్రాతినిధ్యం కల్పించడానికి సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లు( Women Reservation Bill )ను పార్లమెంటులో ప్రవేశపెట్టాలన్నది మా డిమాండ్. మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదించాలని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీలు మహిళా సంఘాలతో కలిసి భారత్ జాగృతి ఈ నెల 10న జంతర్ మంతర్ వద్ద ఒకరోజు నిరాహార దీక్షను తలపెట్టింది.ఈ క్రమంలోనే మార్చి 9న ఢిల్లీలో విచారణకు రావాల్సిందిగా ఈడీ నాకు నోటీసులు జారీ చేసింది.

ఇలాంటి చర్యలతో బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సీఎం కేసీఆర్‌ను, బీఆర్ఎస్ పార్టీని లొంగ తీసుకోవడం కుదరదని బీజేపీ తెలుసుకోవాలి. సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగాడుతూనే ఉంటాము. దేశ అభ్యున్నతి కోసం గొంతెత్తుతాము. ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి తెలంగాణ ఎప్పటికీ తలవంచబోదని ఢిల్లీలో ఉన్న అధికార కాంక్షపరులకు గుర్తుచేస్తున్నాను. ప్రజల హక్కుల కోసం ధైర్యంగా పోరాటం చేస్తాము అని క‌విత స్ప‌ష్టం చేశారు.