చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్‌లు అమలు చేయాలనే డిమాండ్‌తో భారత్ జాగృతి అధ్యక్షురాలు, BRS ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద దీక్షకు దిగారు. రాజకీయాల్లోనూ మహిళలకు సముచిత స్థానం దక్కాలని ఆమె అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు చాలాకాలంగా పెండింగ్‌లో ఉందని.. దాన్ని ఆమోదించి చట్టంగా తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద భారత్ జాగృతి ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్షలో కవిత మాట్లాడుతూ.. భారత సంస్కృతిలో మహిళకు పెద్దపీట వేశారన్నారు. అమ్మానాన్న అంటారు.. అందులో అమ్మ శబ్ధమే ముందు ఉంటుంది. రాజకీయాల్లోనూ మహిళకు సముచిత స్థానం దక్కాలని స్పష్టంచేశారు. దీక్షకు మద్దతు తెలుపుతున్న అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ధరణిలో సగం.. ఆకాశంలో సగం.. అవకాశంలోనూ సగం కావాలంటూ ఈ సందర్భంగా ఆమె వ్యాఖ్యానించారు.
మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని, 27 ఏళ్ల నుంచి బిల్లు పెండింగ్‌లో ఉందన్నారు. 1996లో దేవెగౌడ హయాంలో బిల్లు పెట్టినా చట్టం కాలేదన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ ఉంది. ఈ బిల్లు విషయంలో బీజేపీ ముందుకొస్తే అన్ని పార్టీలు మద్దతు ఇస్తాయి. రాజకీయాల్లో మహిళలకు సముచిత స్థానం దక్కాలని, మహిళా రిజర్వేషన్ సాధించేవరకు విశ్రమించేది లేదన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.
కవిత దీక్షకు 18 విపక్ష పార్టీలు సంఘీభావం ప్రకటించాయి. ఆ పార్టీ ప్రతినిధులు దీక్షలో పాల్గొని సంపూర్ణ మద్దతు తెలిపారు. జాతీయ నేతల విగ్రహాలకు పూలమాలలు వేసిన అనంతరం కవిత నిరసన దీక్షలో కూర్చున్నారు. సీపీఏం నేత సీతారాం ఏచూరి స్వయంగా దీక్షలో పాల్గొని మద్దతు ఇచ్చారు. కవిత ఒక మంచి అడుగు వేశారని, మహిళా రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెట్టేంత వరకు పోరాటం చేయాలని సీతారాం ఏచూరి సూచించారు. మహిళా రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెడతామని గతంలో మోదీ హామీ ఇచ్చారని, కానీ తొమ్మిదేళ్లు అయినా బిల్లులను ప్రవేశపెట్టలేదన్నారు.
ఉదయం 10.30 గంటలకు కవిత దీక్షను ప్రారంభించారు. సాయంత్రం 4 గంటల వరకు దీక్ష కొనసాగనుంది. ఈ దీక్షలో తెలంగాణ మహిళా మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌తో పాటు బీఆర్ఎస్ మహిళా ఎంపీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. భారత జాగృతి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ దీక్షలో వివిధ రాష్ట్రాలకు చెందిన మహిళా సంఘాలు పాల్గొన్నాయి. మహిళల నిరసనల నేపథ్యంలో జంతర్‌మంతర్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భారీ భద్రత ఏర్పాటు చేశారు.