గవర్నర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గానూ.. ఈ నెల 14 న జాతీయ మహిళ కమిషన్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డికి నోటిసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నిన్న కౌశిక్ రెడ్డి జాతీయ మహిళా కమిషన్ ఎదుట హాజరై గవర్నర్ తమిళిసై పట్ల చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు గవర్నర్‌కి లిఖితపూర్వక క్షమాపణ చెబుతానని కౌశిక్‌రెడ్డి మహిళా కమిషన్ కు తెలిపారు. గవర్నర్ తమిళిసై పై అవమానకరమైన రీతిలో కౌశిక్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించి, నోటీసులు జారీ చేసింది. విచారణకు వచ్చిన కౌశిక్‌రెడ్డి క్షమాపణలు చెప్పడంతో కథ సుఖాంతమైంది.
జనవరి 25న జమ్మికుంటలో నిర్వహించిన ఓ సమావేశంలో కౌశిక్ రెడ్డి.. ఈ రాష్ట్ర ప్రథమ పౌరురాలు, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ, శాసనమండలి ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆమోదించకుండా తన దగ్గరే అంటి పెట్టుకుంటారా అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అప్పట్లోనే ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారి తీశాయి. రాజ్యాంగ అత్యుత్తమ పదవిలో ఉన్న గవర్నర్‌ను మహిళ అని కూడా చూడకుండా వ్యాఖ్యలు చేశారని విపక్షాలు ధ్వజమెత్తారు. కౌశిక్రెడ్డిపై చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశారు. చివరకు క్షమాపణలు చెప్పడంతో అంతా సద్దుమణిగినట్లయింది.