సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా 1094 ఎకరాల అటవీ భూమిని దత్తత తీసుకుంటానని బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ ప్రకటించారు. కొండగట్టు పుణ్యక్షేత్రం పరిధిలోని కొడిమ్యాల అటవీ ప్రాంతంలోని కంపార్ట్‌మెంట్ 684లో 752 ఎకరాలు, కంపార్ట్‌మెంట్ 685 పరిధిలోని 342 ఎకరాలు మొత్తం కలిపి 1094 ఎకరాలను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం కింద దత్తత తీసుకుంటున్నట్టు రాజ్యసభ ఎంపీ అయిన జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రకటించారు. కోటి రూపాయలతో ఈ ప్రాంతాన్ని మరింత పచ్చదనంతో నింపి దశల వారీగా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. తన చిన్నతనంలో సీఎం కేసీఆర్‌తో కలిసి చాలాసార్లు కొండగట్టు అంజన్నను దర్శించుకున్నానని, తనకు ప్రత్యేక అనుబంధం ఉందని వివరించారు. కాగా, జగిత్యాల జిల్లాలోని ఆంజనేయస్వామి కొలువై ఉన్న కొండగట్టును బుధవారం కేసీఆర్ సందర్శించారు. యాదాద్రిని తీర్చి దిద్దిన ప్రముఖ ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయితో కలిసి ఆలయాన్ని పునర్మిస్తామని ప్రకటించారు. ఇందుకోసం గతంలో రూ. 100 కోట్లు కేటాయించగా, తాజాగా మరో రూ. 500 కోట్లను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆలయాన్ని, ఆలయ పరిసరాలను ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.