రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయం సాధిస్తూ వచ్చిన అధికార బీఆర్ఎస్ త్వరలో జరుగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. హైదరాబాద్ స్థానిక సంస్థలు, హైదరాబాద – రంగారెడ్డి – మహబూబ్ నగర్ టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్ధులను బరిలోకి దింపట్లేదు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో ఎంఐఎం అభ్యర్ధికి మద్దతు ఇస్తుండగా, టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో భావసారూప్యత కలిగిన ఉపాధ్యాయ సంఘాల తరపున పోటీ చేసే అభ్యర్ధికి మద్ధతు ఇవ్వాలని యోచిస్తోంది. ఈ స్థానానికి 2017లో పీఆర్టీయూ (టీఎస్) తరపున పోటీ చేసిన కాటేపల్లి జనార్ధన రెడ్డికి మద్ధతు ఇచ్చింది. అయితే ఇప్పటికే జనార్ధన్ రెడ్డి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్సీ అవగా, ఆయనకు పోటీగా గుర్రం చెన్నకేశవరెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇక గత ఎన్నికల్లో పీఆర్టీయూ (తెలంగాణ) తరపున పోటీ చేసిన హర్షవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ తరపున బరిలో ఉండనున్నారు. అటు బీజేపీ విద్యాసంస్థల అధినేత ఏవీఎన్ రెడ్డిని దింపింది. ఇలా మొత్తం 18 మంది పోటీ చేస్తుండగా, బీఆర్ఎస్ ఎవరికి మద్ధతు ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది. అటు హైదరాబాద్ స్థానిక సంస్థల్లో బీజేపీ బలం 33 ఓట్లు, బీఆర్ఎస్ – మజ్లిస్ బలం 83గా ఉంది. సంఖ్యాపరంగా బీఆర్ఎస్‌కి అధిక ఓట్లు ఉన్నా పోటీకి దూరంగా ఉండడం గమనార్హం.