వీ6 టీవీ చానల్, వెలుగు దినపత్రిక తమకు వ్యతిరేకంగా వార్తలు, కథనాలు ప్రసారం చేయడమే పనిగా పెట్టుకుంటున్నాని తిట్టిపోస్తున్న బీఆర్ఎస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ రెండింటిని తాము నిషేధిస్తున్నామని ప్రకటించింది. ‘‘ఇకపై మా ప్రెస్ మీట్లకు వాటిని రానివ్వం.
పార్టీ నేతలు ఆ మీడియా నిర్వహించే చర్చలకు, ఇతర కార్యక్రమాలకు వెళ్లరు’’అని తెలిపింది. బీఆర్ఎస్ ప్రభుత్వంపై వీ6, వెలుగు పత్రికలు కత్తికట్టాయని, వాటిని ఎప్పుడు బ్యాన్ చేయాలో తమకు తెలుసని మంత్రి కేటీఆర్ హెచ్చిరిన కొన్ని రోజులకే బీఆర్ఎస్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హణం. ఈ నిషేధమే కాకుండా వీ6 కేబుల్ ప్రసారాలను కూడా నిలిపివేయడానికి బీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
బీజేపీకి కొమ్ము కాస్తున్నందుకే
‘‘తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను అడుగడుగునా దెబ్బతీస్తూ, బీజేపీకి కొమ్ముకాస్తున్న V6 ఛానల్, వెలుగు దినపత్రికలను బహిష్కరించాలి అని నిర్ణయం తీసుకున్నాం’’ అని బీఆర్ఎస్ మంగళవారం ఓ ప్రకటనలోతెలిపింది. ప్రజాస్వామ్యంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన సదరు మీడియా సంస్థలు బీజేపీ జేబు సంస్థగా మారి అబద్ధాలు, అసత్యాలు, కట్టుకథలతో BRS పార్టీ పైన, తెలంగాణ రాష్ట్రం పైన విషం చిమ్మడమే ఏకైక ఎజెండాగా పని చేస్తున్నాయని మండిపడింది. ‘‘BRS పార్టీ మీడియా సమావేశాలకు V6, వెలుగు మీడియా సంస్థలను అనుమతించం. దీంతోపాటు ఈ సంస్థలు నిర్వహించే చర్చలతో సహా, ఎలాంటి కార్యక్రమాల్లోనూ పార్టీ ప్రతినిధులెవరూ పాల్గొనకూడదు. బీజేపీ గొంతుకగా మారి, విశ్వసనీయత కోల్పోయిన ఈ మీడియా సంస్థల అసలు స్వరూపాన్ని, ఎజెండాను తెలంగాణ ప్రజలు గ్రహించాలని BRS పార్టీ విజ్ఞప్తి చేస్తోంది’’ అని పేర్కొంది.
కేటీఆర్ ఏమన్నారు?
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితకు నోటీసుల విషయంలో వీ6, వెలుగు పత్రికలు విస్తృతంగా కథనాలు వెలువరించాయ. తమను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేసుకుని వండి వార్చారన్నది బీఆర్ఎస్ వాదన. ఇటీవల కేటీఆర్ విలేకర్లతో మాట్లాడుతూ ‘‘గుజరాత్‌లో లిక్కర్ తాగి 42 మంది చనిపోతే అది వీ6లో చూపించారా? అందులో చూపిస్తారో తెలుసు.
ఏం మాట్లాడతారో తెలుసు. ఏం డ్రామాలు చేస్తారో మాకు తెలుసు. ఎప్పుడు బ్యాన్ చేయాలో కూడా మాకు తెలుసు’’ అని అన్నారు. కొన్ని చిల్లర చానళ్లు బీజేపీ బాకా ఊదుతున్నాయని మండిపడ్డారు. బీజేపీ ఆఫీసులో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడేను బ్యాన్ చేశారని, తమను వ్యతిరేకించేవాటిని తామెందుకు బ్యాన్ చేయకూడదని ప్రశ్నించారు. కాగా, ఏబీఎన్, టీవీ9లు తమకు వ్యతిరేకంగా కథనాలు ప్రసారం చేశాయంటూ అప్పట్లో టీఆర్ఎస్ ప్రభుత్వం నిషేధం విధించడం తెలిసిందే.