ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్ ఆవిర్భావ సభను నిర్వహించాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది. ఈ సభకు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ హాజరుకానున్నారు. ఈ మధ్యే ఏపీ నుంచి కొందరు నేతలను బీఆర్ఎస్లో చేర్చుకున్న సీఎం కేసీఆర్.. అదే సమయంలో పార్టీ ఏపీ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్‌ని ప్రకటించారు. తాజాగా బుధవారం ఆయన.. కేసీఆర్‌తో ప్రగతిభవన్‌లో సమావేశమై.. ఏపీలో పార్టీని విస్తరించే అంశంపై చర్చించారు. ఈ సమావేశంలో పార్టీ నేత చింతల పార్థసారథి కూడా ఉన్నారు. ఏపీలో భారీ ఆవిర్భావ సభ నిర్వహించాలని మాట్లాడుకున్నారు. ఈ సభకు సీఎం కేసీఆర్ కూడా రానున్నారని తెలిసింది.
బుధవారం జరిగిన సమావేశంలో… బీఆర్ఎస్ గురించి, ఏ ఉద్ధేశంతో జాతీయ స్థాయిలో పోరాటానికి సిద్ధమైందనే సందేశాన్ని ప్రజల్లోకి ప్రబలంగా తీసుకెళ్లాలని కేసీఆర్.. చంద్రశేఖర్‌కు సూచించినట్లు తెలిసింది. వీలైనంత త్వరగా ఏపీలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ను ప్రారంభించాలని మార్గదర్శనం చేశారు. ఇక పార్టీ సభ్యత్వ నమోదును కూడా భారీఎత్తున చేపట్టాలని, నిర్మాణాత్మక వైఖరితో ముందుకొచ్చే వారిని పార్టీలో చేర్చుకోవాలన్నారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ప్రత్యేక కమిటీల రూపకల్పన చేయాలని చెప్పారు. చంద్రశేఖర్ మాట్లాడుతూ.. కేసీఆర్ నిర్దేశాల మేరకు ఏపీ లో బీఆర్ఎస్ ముందుకు సాగుతుందన్నారు. పార్టీపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి ఉందని, పెద్దఎత్తున చేరికలుంటాయని, ఇప్పటికే పలువురు సంప్రదిస్తున్నారని తెలిపారు.
సభ ఎక్కడ జరపాలి, ఎలా చెయ్యాలి అనే అంశాలపై మరోసారి సమావేశమై చర్చించనున్నారు. ఈ సందర్భంగా.. తెలంగాణలో జరిగిన అభివృద్ధి, రైతులకు అందుతున్న సంక్షేమ పథకాలు, నీటి పారుదల రంగంలో సాధించిన ప్రగతి అంశాలతోపాటూ భారత్‌తో పోల్చితే చైనా ఎలా దూసుకుపోయింది? భారత్ ఎందుకు వెనకబడింది? కేంద్రం పరిపాలన ఎలా ఉంది? వంటి అంశాలను కేసీఆర్.. ఏపీ ప్రజల ముందు ఉంచాలనుకుంటున్నట్లు తెలిసింది.