అత్యాచార ఆరోపణలు ఎదుర్కొన్న ఓ బడా వ్యాపారిని బీజేపీలో చేర్చుకోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పక్కా సాక్ష్యాలున్నాయని భావిస్తున్న ఈ కేసు నిందితుడికి కండువా కప్పి ‘సభ్య సమాజానికి’ ఏం సందేశమిస్తారని సోషల్ మీడియా బీఆర్ఎస్, కాంగ్రెస్ తదితర పార్టీలు దుయ్యబడుతన్నాయి. వచ్చే ఎన్నికల్లో సిద్దిపేట నుంచి పోటీ చేస్తానని చెప్పుకుంటున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి గదగోని చక్రధర్ గౌడ్ బుధవారం ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర నేతలు బండి సంజయ్, ఈటల రాజేందర్‌ల సమక్షంలో కషాయ కండువా కప్పుకున్నారు. దీని సంబంధించిన ఫోటోలు బయటికి రావడంతో సోషల్ మీడియాలో రచ్చరచ్చ జరుగుతోంది. ‘’ఒక రేపిస్టును, అరెస్టయిన వాడిని పవిత్రతకు మారుపేరని చెప్పుకుంటున్న మీ పార్టీలో ఎలా చేర్చుకుంటారు? స్త్రీలను వేధించేవాళ్లకు ఇలా మద్దతిస్తున్నారా?’’ అని విమర్శలు వస్తున్నాయి.
కేసు ఇదీ..
బాధితురాలు, పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. సంఘ సంస్కర్తనని చెప్పుకునే చక్రధర్ గౌడ్ (35) స్నేహితుడి భార్యపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడని శామీర్ పేట పోలీసులు గత నెలలో అరెస్ట్ చేశారు. బాధితురాలు మేడ్చల్ జిల్లా శామీర్‌పేట మండలం తూంకుంటలో ఓ సంస్థలో భర్తతో కలిసి పనిచేస్తోంది. జనవరి 31వ తేదీ రాత్రి చక్రధర్ ఆమె ఇంటికి వెళ్లి, భర్త లేని సమయంలో అత్యాచారానికి ప్రయత్నించాడు. ఆమె కేకలు వేయడంతో పరారయ్యాడు. ఆమె భర్తకు చెప్పింది. అయితే భర్త పట్టించుకోకపోవడంతో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. పోలీసులు చక్రధర్‌ను అరెస్ట్ చేయగా బెయిల్‌పై విడుదలయ్యాడు.