ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారణకు పిలవడం దేశ రాజకీయాలను హీటెక్కించింది. రాష్ట్రంలో బీజేపీ-బీఆర్ఎస్ నాయకుల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారణకు పిలవడం, ఆమెను అరెస్టు చేస్తారంటూ బీజేపీ నాయకులు వ్యాఖ్యలు చేయడంతో రాష్ట్ర రాజకీయాలు కాకరేపుతున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీకి వ్యతిరేకంగా హైదరాబాద్ నగరంలో బ్యానర్లు, పోస్టర్లు వెలిశాయి. బీజేపీ అగ్రనేతలు టార్గెట్ చేస్తూ సెటైరికల్ పోస్టర్లు ఏర్పాటు చేశారు కొందరు.
‘వెల్‌కమ్ టు అమిత్ షా’
హైదరాబాద్ లోని నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీలో జరిగే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ ఎఫ్) 54వ ఆవిర్భావ దినోత్సవ పరేడ్ కు హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలోనే అమిత్ షాను వాషింగ్ పౌడర్ నిర్మా పోస్టర్ తో స్వాగతం పలుకుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాషింగ్ పౌడర్ నిర్మా యాడ్ తో కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షాకు బీఆర్ఎస్ స్వాగతం పలికింది. సంబంధిత పోస్టర్లలో వివిధ ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకులు బీజేపీలో చేరిన తర్వాత వారిపై ఉన్న అన్ని దర్యాప్తులు, విచారణలు ఆగిపోయిన విషయాలను గుర్తు చేసే విధంగా పలువురు నాయకుల ఫొటోలు ఉన్నాయి.
Welcome Amit Shah ! ! pic.twitter.com/J28jCJBU7p
— Krishank (@Krishank_BRS) March 12, 2023
మరకలు మాయం..
వాషింగ్ పౌడర్ నిర్మా యాడ్ లోకనిపించే అమ్మాయి ఫొటో ఫేసులో బీజేపీలోకి మారినవారితో పాటు వివిధ కేసుల ఆరోపణలు ఎదుర్కొన్న నాయకుల ఫొటోలు ఉన్నాయి. పోస్ట్‌లో బీజేపీ నేత నారాయణ్ రాణే, సువేందు అధికారి, సుజనాచౌదరి, జ్యోతిరాదిత్య సింధియా, ఈశ్వరప్ప సహా పలువురు నేతల ముఖాలు ఉన్నాయి. నిర్మా సర్ఫ్‌తో బట్టలపై మరకలు మాయమై పోయినట్లు.. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు బీజేపీలో చేరితే వారికి అంటిన మరకలు కూడా పోతాయని ఆ పోస్టర్లు తెలియజేస్తున్నాయి. బీజేపీ తీరును, కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్న అంశాలను ప్రస్తావిస్తూ అమిత్ షాపై విమర్శలు చేస్తూ ఈ పోస్టర్లు వెలిశాయి.
ఎమ్మెల్సీ కవితకు మద్దతుగా బైబై మోదీ అంటూ హైదరాబాద్‌తోపాటు ఢిల్లీలో శనివారం పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. బీజేపీలో చేరగానే కేసులు మాయమంటూ.. ఇటీవల బీజేపీలో చేరిన పలువురి ఫొటోలను ప్రదర్శించారు. బీజేపీలో చేరితే అవినీతి మరకలు కాషాయంలోకి మారిపోతాయని.. అలాగే కవిత ఫొటోపై అసలైన రంగుల వెలసిపోవు అంటూ పోస్టర్లు అంటించారు.