రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సెస్ (సహకార విద్యుత్తు సరఫరా సంస్థ) ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. సిరిసిల్ల, వేములవాడ, మానకొండూర్, చొప్పదండి నియోజకవర్గాల పరిధిలోని 15 డైరెక్టర్ స్థానాలకుగాను అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే గెలుపొందారు. మొత్తం 15 డైరెక్టర్ స్థానాలనూ కైవసం చేసుకున్నారు. ఈ నెల 24న (శనివారం) ఎన్నికలు నిర్వహించగా.. సోమవారం వేములవాడలో ఓట్లు లెక్కించారు. అర్ధరాత్రి వరకు ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. దీనికి కారణం రెండు స్థానాల్లో తొలుత బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి కంటే బీజేపీ బలపరిచిన అభ్యర్థికి కొన్ని ఓట్ల మెజారిటీ వచ్చింది. ఫలితాలు వెల్లడించక ముందే రీకౌంటింగ్ చేపట్టాలని బీఆర్ఎస్ కార్యకర్తలు అధికారులను మళ్లీ కోరడంతో.. రీకౌంటింగ్‌లో బీఆర్ఎస్ బలపరిచిన వారికే మెజారిటీ ఓట్లు రావడంతో వారి గెలుపును అధికారికంగా ప్రకటించారు.
ఈ ఎన్నికల్లో 6 నుంచి 7 స్థానాలు వస్తాయని బీజేపీ అంచనా వేసింది. కానీ ఫలితాలు తారుమారయ్యాయని ఆరోపిస్తోంది. తమ అభ్యర్థులు ఐదు చోట్ల గెలిచినప్పటికీ ఫలితాలను తారుమారు చేశారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఫలితాల వెల్లడిలో అధికార బీఆర్ఎస్ అక్రమాలకు పాల్పడిందన్నారు. ‘‘ప్రజాస్వామ్యాన్ని అధికారపక్షం అపహాస్యం చేసింది. బీఆర్ఎస్ వాళ్లే ఓట్లేసుకున్నారు. ఫలితాలనూ వాళ్లే ప్రకటించుకున్నారు. ఈ మాత్రం దానికి ఎన్నికలు ఎందుకు? సాధారణ ఎన్నికల్లో ఈ ఆటలు చెల్లవు. కేసీఆర్‌కు గుణపాఠం చెప్పాలని ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారు’’ అని సంజయ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.