మహిళా రిజర్వేషన్ బిల్లుపై వెంటనే సానుకూల నిర్ణయం తీసుకోవాలంటూ తెలంగాణ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) మహిళ నేతలు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ సంధించారు. పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ బిల్లును ఆమోదించాలంటూ ఢిల్లీలో దీక్ష చేసిన నేపథ్యంలో మోదీకి పలు అంశాలు వివరిస్తూ సుదీర్ఘ వినతి లేఖ పంపారు. దీనిపై సంతకాలు చేసినవారిలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, సహా పలువు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మేయర్లు, జడ్పీ చైర్పర్సన్లు ఉన్నారు.
మహిళ సంక్షేమానికి, పాలనలో వారి భాగస్వామ్యం పెంచడానికి సీఎం కేసీఆర్ ఎంతగానో కృషి చేస్తున్నారని ప్రశంసలు కురిపించారు. ‘‘మహిళా సాధికారికత బీఆర్ఎస్ తన నిబద్ధతను 100% రుజువు చేసుకుంది. చట్ట ప్రకారం కేవలం 33% మాత్రమే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాల్సిన నిబంధన ఉంటే దాన్ని దాటి 50% మహిళలకు… పదవులు దక్కేలా రిజర్వేషన్లను తప్పనిసరి చేశారు. రాష్ట్రంలో మొత్తం 113354 గ్రామ వార్డులుంటే, మహిళా వార్డు మెంబర్ల సంఖ్య – 59408, 12751 సర్పంచ్ స్థానాల్లో, మహిళా సర్పంచుల సంఖ్య 6844. 5857 ఎంపీటీసీ స్థానాల్లో మహిళల ఎంపీటీసీల సంఖ్య 3326.
మెత్తం రాష్ర్టంలో ఉన్న 539 జడ్పిటిసిల స్థానాల్లో .. మహిళా జడ్పీటీసీల సంఖ్య 300. 539 ఎంపీపీల సీట్లలో… మహిళా ఎంపీపీల సంఖ్య 340, రాష్ట్రంలో జిల్లా పరిషత్ చైర్మన్ స్థానాలు 32 ఉంటే అందులో మహిళలకే 20 చోట జడ్పీ చైర్మన్ పదవులు దక్కాయి. 125 మున్సిపాలిటీల్లో కౌన్సిలర్ల సంఖ్య 2849 కాగా, మహిళా కౌన్సిలర్ల సంఖ్య 1520, 125 మున్సిపల్ చైర్ పర్సన్ పదవులకు గాను, 72 చోట్ల మహిళలకే అవకాశం కల్పించారు. 13 కార్పొరేషన్లలో కార్పొరేటర్ల సంఖ్య 661 కాగా, మహిళా కార్పొరేటర్ల సంఖ్య 351గా ఉంటే, మొత్తం 13 మేయర్ స్థానాలుండగా, అందులో మహిళలకే 8 స్థానాలు కట్టబెట్టిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే’’ అని వివరించారు. మహిళా బిల్లును తొక్కిపెడితే బీజేపీకి వ్యతిరేకంగా భారీ ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.