జవాన్లను వదలని కరోనా.. 2వేల మందికి పైగా పాజిటివ్  - MicTv.in - Telugu News
mictv telugu

జవాన్లను వదలని కరోనా.. 2వేల మందికి పైగా పాజిటివ్ 

July 2, 2020

BSF And CRPF Jawans Suffer With Corona

దేశంలో కరోనా ఉదృతి ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ మహమ్మారి భారత జవాన్లను కూడా వదలడం లేదు. ఇప్పటికే సినీ,రాజకీయ ప్రముఖులకు సోకుతున్న  వైరస్ ప్రస్తుతం బీఎస్ఎఫ్, సీఆర్‌పీఎఫ్‌లలోని సిబ్బందికి తలనొప్పిగా మారింది. వరుసగా చాలా మంది సైనికులు వ్యాధిబారిన పడుతున్నారు. దీంతో నిత్యం  గస్తీ కాసే బృందాలకు ఇది తలనొప్పిగా మారింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు తగిన చర్యలు ప్రారంభించారు. 

ఇప్పటి వరకు భద్రతా బలగాల్లో రెండు వేలకు పైగా మందికి లక్షణాలు బయటపడ్డాయి. సీఆర్‌పీఎఫ్‌లో 1,219 మంది, బీఎస్ఎఫ్‌లో 1,018 మందికి పాజిటివ్ వచ్చిందని కేంద్ర హోంశాఖ అధికారులు చెప్పారు.  దీంతో వారందరికి మెరుగైన చికిత్స అందిస్తున్నామని అన్నారు. ముందు జాగ్రత్త చర్యగా అనుమానిత లక్షణాలు ఉన్నవారిని వెంటనే క్వారంటైన్ చేసి పరీక్షలు చేస్తున్నామని చెప్పారు. భద్రత కోసం నిత్యం గస్తీ కాసే జవాన్లకు ఇలా వ్యాధి సోకడం కలవరం రేపుతోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ముందు ముందు ఇబ్బందులు తప్పవని అంటున్నారు. కాగా దేశంలో ఇప్పటి వరకు  5,85,493 మంది కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. వీరిలో 60 శాతం వరకు కోలుకున్నారు.