bsp leader Praveen Kumar responds to riots in Konaseema
mictv telugu

  ఒక జిల్లాకు పేరు పెడితే ఇంత రచ్చా? మా లెక్కలు తేలాల్సిందే

May 25, 2022

bsp leader Praveen Kumar responds to riots in Konaseema

కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడం వలన అమలాపురం, రావులపాలెంలో ఎంత గొడవ జరిగిందో తెలిసిందే. దీనికి కారణం మీరంటే మీరని రాజకీయ పార్టీలు, అధికార, ప్రతిపక్షాలు ఒకరినొకరు నిందించుకున్నారు. కానీ, అసలు కారణం మీద ఎవరూ దృష్టి పెట్టడం లేదు. అక్కడి సమాజం కులాల వారీగా విడిపోయినందునే ఈ ఉద్రిక్త పరిస్థితులు అని సామాజిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదేకాక, పలువురు పలు రకాలుగా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. తాజాగా బీఎస్పీ తెలంగాణ కో ఆర్డినేటర్, రిటైర్డ్ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ బుధవారం ఆసక్తికరంగా స్పందించారు.

‘స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచీ ప్రతీ స్కీముకు, డ్యాముకు, పార్కుకు, గ్రౌండుకు, రోడ్డుకు, ఫ్లైఓవర్లకు, విమానాశ్రయాలకు కేవలం గాంధీ, నెహ్రూల పేర్లు మాత్రమే పెట్టారు. ఈ విషయంలో జనాభాలో 90 శాతం ఉన్న బడుగు, బలహీన వర్గాలు ఎప్పుడైనా ధిక్కరించాయా? మౌనంగానే ఉన్నాయి కదా. ఇప్పుడు ఒక్క జిల్లాకు అంబేద్కర్ పేరు పెడితే ఎలా వ్యతిరేకిస్తారు. ఇలాగయితే తేల్చాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి’ అంటూ తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కాగా, ఇప్పటివరకు అమలాపురం పరిసర ప్రాంతాలకు పరిమితమైన అల్లర్లు తాజాగా రావులపాలెంకు కూడా పాకాయని విశ్వసనీయ సమాచారం.