బీఎస్పీ నేతలను గాడిదపై ఊరేగించిన పార్టీ కార్యకర్తలు - MicTv.in - Telugu News
mictv telugu

బీఎస్పీ నేతలను గాడిదపై ఊరేగించిన పార్టీ కార్యకర్తలు

October 22, 2019

బీఎస్పీ నేతలకు ఆ పార్టీ కార్యకర్తల నుంచి ఊహించని పరిణామం ఎదురైంది. ఇద్దరు నేతలకు చెప్పుల దండలు వేసి గాడిదపై ఊరేగించారు. రాజస్థాన్‌లో మంగళవారం ఈ ఘటన జరిగింది. బీఎస్పీ రాష్ట్ర ఇంచార్జీ సీతారాం, కో ఆర్డినేటర్ రాంజీ గౌతమ్‌లకు నల్ల రంగుపూసి గాడిదలపై ఊరేగించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆగ్రహించిన కార్యకర్తలు వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. 

జైపూర్‌లోని పార్టీ కార్యాలయం ఆవరణలో ఈ ఘటన జరిగింది. ఎన్నికల సమయంలో పార్టీ టికెట్లు అమ్ముకోవడంతో పాటు ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కుట్ర చేశారని వారు ఆరోపించారు. బీఎస్పీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడాన్ని జీర్ణించుకోలేని కార్యకర్తలు ఈ దాడి ఘటనకు పాల్పడ్డారు. కాగా ఇప్పటికే తమ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకున్న కాంగ్రెస్ పార్టీపై మాయావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే సొంత పార్టీ నేతలపై కార్యకర్తలు ఇలా తిరుగుబాటు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది.