BSP state president RS Praveen Kumar visited Preeti in Nims
mictv telugu

ప్రగతిభవన్‌లోనూ ర్యాగింగ్.. ప్రీతిపై మతం కరెక్ట్ కాదు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

February 25, 2023

BSP state president RS Praveen Kumar visited Preeti in Nims

ర్యాగింగ్ భూతం ప్రగతిభవన్‌లో కూడా ఉందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యానించారు. అక్కడ రాజకీయ ర్యాగింగ్ నడుస్తోందని, తక్కువ కులం అధికారులకు అందులో ఎంట్రీ లేదని ఆరోపించారు. నిమ్స్‌లో చికిత్స పొందుతున్న పీజీ వైద్యురాలు ప్రీతిని ఆయన పరామర్శించి డాక్టర్లతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రీతి కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన పైవ్యాఖ్యలతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేసిన లవ్ జిహాద్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఘటనకు మతం రంగు పులిమి రాజకీయ లబ్దిపొందాలనే చూస్తే ఖబడ్దార్ అని హెచ్చరించారు.

ఇది బడుగు, బలహీన వర్గాలు, ప్రీతి కుటుంబాన్ని అవమానించడమేనన్నారు. ఇటీవల ఓ విద్యార్ధిపై తన కొడుకు దాడిని సమర్ధించుకుని, ప్రీతి ర్యాగింగ్ ఘటనకు మానవతా కోణంలో ఆలోచించకుండా మత రాజకీయాలు చేయడం సరికాదన్నారు. పేద వర్గాలను అవమానించేలా మాట్లాడితే సహించమని స్పష్టం చేశారు. మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడమే కాకుండా విద్యార్ధులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదేనని తేల్చి చెప్పారు. అనస్థీషియా డిపార్ట్‌మెంట్ హెడ్ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.