బీటెక్ విద్యార్థులకు..జేఎన్‌టీయూ శుభవార్త - MicTv.in - Telugu News
mictv telugu

బీటెక్ విద్యార్థులకు..జేఎన్‌టీయూ శుభవార్త

May 11, 2022

తెలంగాణ వ్యాప్తంగా బీటెక్ చదువుతున్న విద్యార్థులకు జేఎన్‌‌టీయూ శుభవార్త చెప్పింది. వచ్చే విద్యా సంవత్సరం (2022-23) నుంచి జేఎన్‌టీయూ పరిధిలో ఇంజినీరింగ్‌లో చేరే విద్యార్ధులు రెండవ సంవత్సరం నుంచి బ్రేక్ తీసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. ఇకనుంచి రాష్ట్రంలో జాతీయ విద్యావిధానాన్ని అమలు చేయాలని జేఎన్‌టీయూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం అధికారులు సమావేశమై, పలు నిర్ణయాలు తీసుకున్నారు.

జాతీయ విద్యావిధానం ప్రకారం.. ‘బీటెక్ నాలుగేళ్లు. ఈ నాలుగేళ్లలో ఏటా బ్రేక్ తీసుకుని, తిరిగొచ్చి చదువును కొనసాగించవచ్చు. మొదటి ఏడాదిలో ఆపితే సర్టిఫికెట్, రెండో ఏడాదిలో ఆపితే డిప్లొమా, మూడో ఏడాదిలో ఆపితే డిగ్రీ, నాలుగో ఏడాదిలో ఆపితే ఆనర్స్ డిగ్రీ ఇవ్వాల్సి ఉంటుంది.’ కానీ, జేఎన్‌టీయూ మాత్రం రెండో ఏడాది నుంచే విద్యార్థులు బ్రేక్ తీసుకునేందుకు అవకాశం ఇస్తూ నిర్ణయం తీసుకుంది.

ఇక, సిలబస్ విషయానికొస్తే.. జాతీయ విద్యావిధానం ప్రకారమే సిలబస్‌ ఉండేలా మార్పులు చేసేందుకు జేఎన్టీయూ సన్నహాలు చేస్తుంది. సిలబస్‌పై చర్చించేందుకు ఈ నెల 19,20,21 తేదీల్లో బోర్డ్ ఆఫ్ స్టడీస్ సమావేశాలు నిర్వహించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.