తెలంగాణ బడ్జెట్ ఎలా ఉండబోతోంది? - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణ బడ్జెట్ ఎలా ఉండబోతోంది?

March 13, 2018

తెలంగాణ రాజకీయాలు వాడివేడిగా ఉన్నాయి. కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ప్రకటన, టీఆర్ఎస్ హవా, కాంగ్రెస్ దూకుడు, దురుసు, ముంచుకొస్తున్న ఎన్నికల నేపథ్యంలో 2018-19 రాష్ట్ర బడ్జెట్ ను ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఈ నెల 15న ప్రవేశపెట్టనున్నారు. దీంతో అందులో ఏ విశేషాలుంటాయన్న ఆసక్తి మొదలైంది. బడ్జెట్ సమావేశాల తీరుతెన్నులు ఎలా ఉండాలన్నదానిపై సీఎం కేసీఆర్ ఇప్పటికే మూడుసార్లు సమీక్షలు నిర్వహించారు. సంక్షేమ పథకాలు, సాగునీటి ప్రాజెక్టులపై పట్టుదలతో ఉన్న సర్కారు ఆలోచనలు, అంచనాలు బడ్జెట్‌లో ప్రతిఫలిస్తాయని పరిశీలకులు భావిస్తున్నారు.

బడుగు వర్గాలకు భారీ కేటాయింపులు..

మిగులు బడ్జెట్‌లో ఉన్న తెలంగాణ సర్కారు ఈసారి కూడా సంక్షేమ పథకాలుకు భారీ కేటాయింపులు జరపనుంది. గత ఏడాది ఎస్సీలకు 14,374 కోట్లు, ఎస్టీలకు రూ. 8165 కోట్లు, బీసీలకు 5,070, ఎంబీసీలకు రూ. 1000 కోట్లు కేటాయించారు. బీసీలకు 119 గురుకులాలు కూడా మంజూరు చేశారు. రిజర్వేషన్ల కేటాయింపుపై రాష్ట్రాలకే హక్కు ఉండాలని కేసీఆర్ ఉద్యమిస్తుండడంతో ఈసారి కూడా ఆయా వర్గాలకు గతంలోకంటే ఎక్కువ నిధులు కేటాయించే అవకాశముంది.

సాగునీటి ప్రాజెక్టులు

నీరు, నిధులు, నియామకాలు నినాదంతో సాధించుకున్న తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులు గులాబీ సర్కారు అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. కాళేశ్వరం, మిషన్ కాకతీయతోపాటు భగీరథకు కూడా ఇబ్బడిముబ్బడిగా నిధులను పారిస్తోంది. ఎన్నికలకు ముందునాటి హామీలేకాకుండా, తర్వాత సీఎం, మంత్రి హరీశ్ రావు స్వయంగా ఇచ్చిన హామీలు ఈ ప్రాజెక్టులతో ముడిపడి ఉన్నాయి. గత ఏడాది సాగునీటి ప్రాజెక్టులు, పథకాలం కోసం రూ. 25 వేల కోట్లు కేటాయించారు. ఎన్నికలకు ఏడాది వ్యవధి వుండడంతో ఈ లోపల ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను పూర్తి చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇది ఇజ్జత్ కా సవాల్ కనుక ప్రభుత్వం ప్రాజెక్టులు పూర్తవడానికి సరిపడా నిధులను కేటాయించే అవకాశముంది. వ్యవసాయానికి కూడా భారీగా నిధులు అందొచ్చు.

ప్రజాకర్షక పథకాలు..

డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకంతోపాటు షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి తదితర సంక్షేమ పథకాలకు కింద అందించే మొత్తం కూడా పెరిగే అవకాశముంది.