దేశంలో రైతులు కరువుతో, గిట్టుబాటు ధరల్లేక, అప్పులతో అల్లాడుతున్న నేపథ్యంలో మోదీ ప్రభుత్వం వారిపై దృష్టి సారించింది. 2018-19 బడ్జెట్లో వారికి పెద్ద పీటవేసింది. మేకిన్ ఇండియా, స్టార్టప్ వంటి మంత్రాలు పెద్దగా ఫలితం ఇవ్వని నేపథ్యంలో.. రైతుజనావాళిని టార్గెట్ చేసుని వారి కోసం పలు పథకాలను ప్రకటించింది. ఈ ఏడాది అన్నదాతలకు రూ. 11 లక్షల కోట్ల రుణాలు ఇస్తామని ఆశ చూపింది.
ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ గురువారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో వ్యవసాయ, దాని ఇతర అనుబంధం రంగాలకు భారీ కేటాయింపులు జరిపారు. వ్యవసాయం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేస్తామని, రైతులు ఇబ్బందిపడకుండా అన్ని చర్యలూ తీసుకుంటామని చెప్పారు. వచ్చే సంవత్సరాల్లో 8 శాతానికి పైగా వృద్ధి సాధించేందుకు సంస్కరణలు చేస్తామన్నారు.
మద్దతు ధర ఒకటిన్నరెట్లు అదనంగా..
రైతుల పెట్టుబడికి ఒకటిర్నర రెట్లు అదనంగా ఉండేలా పంటలకు మద్దతుధర కల్పిస్తామని ఆర్థికమంత్రి చెప్పారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే తమ ఆశయమని పునరుద్ఘాటించారు. సేద్యాన్ని లాభసాటి వ్యాపారంగా మారుస్తామన్నారు. మార్కెట్ ధరలు మద్దతు ధరల కంటే తక్కువ ఉంటే ప్రభుత్వమే పంటలను కొంటుందన్నారు. సాగుతోపాటు మత్య్స, పాడిపరిశ్రమలకు కూడా ఊహించనంతగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
బడ్జెట్లో వ్యవసాయం, అనుబంధ రంగాలకు కేటాయింపులు..
*వ్యవసాయ మార్కెట్ల అభివృద్ధికి రూ. 2000 కోట్లతో ఒక సంస్థ
*ఫుడ్ ప్రాసెసింగ్ కు రూ. 1400 కోట్లు
* దేశవ్యాప్తంగా 42 ఆహారశుద్ధి కేంద్రాలు
*సేంద్రీయ వ్యవసాయానికి ప్రోత్సాహం
* వ్యవసాయం, సాగునీటి కోసం నాబార్డుతో కలిసి ప్రత్యేక విధానం
* చేపల పెంపకం, పశుసంవర్థకానికి రూ.10వేల కోట్లు, జాలర్లకు క్రెడిట్ కార్డులు
* ఆపరేషన్ గ్రీన్‌కు రూ.500 కోట్లు
* నేషనల్ బ్యాంబూ మెషిన్‌కు రూ.1200 కోట్లు(వెదురు పరిశ్రమ అభివృద్ధికి)..