రూ. 27 కోట్ల దున్నపోతు హైదరాబాద్‌కు వచ్చేస్తోంది..  - MicTv.in - Telugu News
mictv telugu

రూ. 27 కోట్ల దున్నపోతు హైదరాబాద్‌కు వచ్చేస్తోంది.. 

October 27, 2019

పురుషుల్లో పుణ్యపురుషులు వేరయా అన్నట్లు దున్నపోతుల్లో సర్తాజ్ దున్నపోతు వేరయా! ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన దున్నగా రికార్డుకెక్కిన ఈ జంతురాజ సదర్ పండగ కోసం హైదరాబాద్ నగరానికి వచ్చేస్తోంది. హరియాణా రైతు వీరేంద్రసింగ్‌కు చెందిన సర్తాజ్ ధర అక్షరాలా రూ. 27 కోట్లు. రెండేళ్ల కిందట దీని ధర రూ. 15 కోట్లుగా ఉండేది. కాలంతోపాటు దాని ధరా పెరిగిపోతోంది. 

హైదరాబాద్‌లో యాదవులు దీపావళి పండగ తర్వాత సదర్ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తుండడం తెలిసిందే. ఈసారి ప్రత్యేక ఆకర్షణగా సర్తాజ్‌ను తీసుకొస్తున్నారు. హరియాణా నుంచి తీసుకొచ్చేందుకు మూడున్నర లక్షలు ఖర్చ చేస్తున్నారు. 29న ముషీరాబాద్‌లో జరగబోయే సదర్ వేడుకల కోసం యాదవ సంఘం నాయకుడు ఎడ్ల హరిబాబు యాదవ్ దీన్ని తెప్పిస్తున్నారు. వివిధ పోటీల్లో 25 పతకాలు సాధించిన సర్తాజ్ మూతి నుంచి తోకవరకు 15 అడుగులు ఉంటుంది. బరువు 1600 కేజీలు. ముర్రాజాతికి చెందిన సర్తాజ్ తిండీతిప్పల కోసం భారీ ఖర్చు చేస్తుంటాడు వీరేంద్ర. సాధారణ గడ్డి మొదలుకొని జీడిపప్పు, తేనె వంటివెన్నో దీని మెనూ ఉన్నాయి. దీని తిండి కోసం రోజుకు 4 వేలు ఖర్చు పెడుతున్నారు.  15 కేజీల యాపిల్ పళ్లు,  20 లీటర్ల పాలు, కేజీ బెల్లం, 2 కేజీల కందిపప్పు, శనగపప్పు, బాదాం, పిస్తా. దీని మెనూలో ఉన్నాయి. రోజుకు రెండుసార్లు స్నానం చేసే సర్తాజ్ రోజూ 5 కిలోమీటర్లు మార్నింగ్ వాక్‌ వెళ్తాడు. ఎత్తుకు ఎత్తు బలానికి బలం ఉన్న ఆరేళ్ల సర్తాజ్ వీర్యానికి విపరీతమైన డిమాండ్ ఉంది. ఒక్కో డోసు(స్ట్రా) రూ. 300 పలుకుతుంటుంది. సర్తాజ్ తల్లి 23 లీటర్ల పాలతో రికార్డులు బద్దలు కొట్టింది.