బర్రె పేడ కథ..  సామాన్యుడా.. నీకు సలాం! - MicTv.in - Telugu News
mictv telugu

బర్రె పేడ కథ..  సామాన్యుడా.. నీకు సలాం!

December 30, 2020

బర్రె

తప్పు చేసినవారు ఎవరైనా సరే శిక్ష అనుభవించాల్సిందే. అయితే చాలామంది నేరస్తులు డబ్బు, పలుకుబడి ఉపయోగించుకుని శిక్షల నుంచి తప్పించుకుంటారు. కోర్టులకు ఎక్కి బెయిళ్లు తెచ్చుకుంటారు. సాక్ష్యాలు తారుమారు చేస్తారు. కానీ ఒక సామాన్యుడు ఓ బర్రె చేసిన తప్పుకు జరిమానా చెల్లించి వార్తల్లోకి ఎక్కాడు. చట్టాలను గౌరవించి అక్షరాలా పదివేల రూపాయల జరిమానా చెల్లించి ఆదర్శంగా నిలిచాడు. ఇంతకూ ఆ బర్రె చేసిన నేరం ఏంటి? ఎందుకతడు జరిమానా చెల్లించాడు? 

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన బేతాళ్ సింగ్‌కు కొన్ని బర్రెలు ఉన్నాయి. అవి రోజూ ఉదయం రోడ్లపైకి వస్తుంటాయి. అందులో ఒక రోడ్డుపై పేడ వేసింది. పేడ వేయడం పెద్ద నేరమని దానికి తెలియదు కదా. అయితే పేడ కనిపించడంతో మున్సిపల్ కొంపలు ముంచుకుపోయినట్లు రంగంలోకి దిగారు. ఆ పేడ ఆవు వేసిందా, బర్రె వేసిందా, ఎద్దు వేసిందా అని పరిశోధన ప్రారంభించారు. సీసీ టీవీలు పరిశీలించి అది ఓ బర్రె వేసిన పేడ అని నిర్ధారించారు. ఆ బర్రె ఆచూకీ కూడా కనిపెట్టారు. బేతల్ సింగ్ ఇంటికి వెళ్లి 10 వేల జరిమానా విధించారు. 

 

అతడు చక్కగా ఆ రసీదు తీసుకుని 10 వేలను తక్షణమే చెల్లించాడు. మరోసారి పేడ వేయకుండా చూస్తానని హామీ కూడా ఇచ్చాడు. దీనిపై ప్రజలు రెండు రకాలుగా స్పందిస్తున్నారు. బేతాళ్ సింగ్ సామాన్యుడైనా చట్టాలను గౌరవించి జరిమానా చెల్లించాలని కొందరు ప్రశంసిస్తున్నారు. మరికొందరు మున్సిపల్ అధికారులను తిడుతున్నారు. మూగజీవి పేడవేస్తే క్లీన్ చేయొచ్చు కదా, మున్సిపల్ సిబ్బంది గోళ్లు గిల్లుకుంటున్నారా అని ప్రశ్నిస్తున్నారు. బర్రెకు విచక్షణ ఉండదని, మనుషులకు విచక్షణ ఉండాలని మండిపడుతున్నారు.