Build a great India if you can.. CM's extreme comments
mictv telugu

చేతనైతే అఖండ భారత్ నిర్మించు.. సీఎం తీవ్ర వ్యాఖ్యలు

September 7, 2022

భారత్ జోడో పేరిట కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ బుధవారం కన్యాకుమారి నుంచి యాత్ర ప్రారంభించారు. కశ్మీర్ వరకు ఈ యాత్ర జరుగుతుండగా, దీనిపై అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చే క్రమంలో ఆయన రాహుల్ గాంధీపై రెచ్చిపోయారు. ‘భారతదేశం ఒక్కటిగానే ఉంది. కన్యాకుమారి నుంచి కశ్మీర్, సిల్చార్ నుంచి సౌరాష్ట్ర వరకు ప్రజలంతా ఒక్కటిగానే ఉన్నారు. అలాంటప్పుడు ఈ యాత్రతో పనేముంది? ఇలాంటి యాత్ర పాకిస్తాన్‌లో నిర్వహిస్తే బాగుంటుంది. దేశ విభజనకు కారణం రాహుల్ ముత్తాత నెహ్రూనే. ఆయన చేసిన పనికి పశ్చాత్తాపం చెంది ఉంటే భారత్, బంగ్లాదేశ్‌లను భారత్‌లో కలిపి అఖండ భారత్ నిర్మించవచ్చు’ అని అభిప్రాయపడ్డారు. అటు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారత్‌లో పర్యటిస్తున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. కాగా, అఖండ భారత్ అనేది బీజేపీ మాతృ సంస్థ ఆరెస్సెస్ వాదన. పాక్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్‌లు ఒక్కటిగా ఉంటే అదే అఖండ భారత్. చరిత్రలో చూస్తే ఈ దేశాలు భారత్ నుంచి ఆయా కాలాల్లో వివిధ కారణాలతో ప్రత్యేకంగా ఏర్పడ్డాయి. అయితే ఈ అఖండ భారత్ అనేది నేటి పరిస్థితుల్లో సాధ్యమవుతుందా? లేదా? అనేది పెద్ద సందేహం. మరి భవిష్యత్తులో ఏమవుతుందో చూడాలి.