Building Fail – Brick Wall Crashes With MLA’s Push In Uttar Pradesh
mictv telugu

ఎమ్మెల్యే చేతితో తోయగానే పడిపోయిన గోడ.. సీఎంపై సెటైర్లు

June 24, 2022

ఎమ్మెల్యే చేత్తో తోయగానే ఓ గోడ పడిపోయింది. అదేదో సినిమాలో హీరో మహేష్ బాబులా.. ఎమ్మెల్యే కూడా అంతే బలంగా గోడను చేత్తో కొట్టగానే నేలకూలిందనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఆ గోడ కూలింది.. ఎమ్మెల్యే చేతుల్లోని బలంతో కాదు. సర్కారు వారు నిర్మించబోతున్న కాలేజీ నిర్మాణంలో నాణ్యత లేకపోవడం వల్ల. ఉత్త‌ర ప్ర‌దేశ్‌కు చెందిన ఓ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిపోయింది.

యూపీలోని యోగి ప్రభుత్వం ప్ర‌తాప్‌గ‌ఢ్ జిల్లా రాణిగంజ్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని శివ్ స‌త్‌లోని అట‌వీ ప్రాంతంతో దాదాపుగా రూ.100 కోట్ల నిధుల‌తో ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీని నిర్మిస్తోంది. పునాది పూర్తి అయి… గోడ‌లు ఓ మోస్త‌రు ఎత్తుకు లేచాయి. ఈ నిర్మాణాల నాణ్య‌త ఎలా ఉంద‌న్న విష‌యాన్ని ప‌రిశీలించేందుకు స్థానిక సమాజ్ వాదీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఆర్కే వ‌ర్మ అక్క‌డికి చేరుకున్నారు.

ప‌నుల నాణ్య‌త‌పై అనుమానం వచ్చి గోడ‌ను అలా చేత్తో త‌డితే ఊగింది. ఇంకేముంది మరికాస్తగా తోయ‌డంతో ఉన్న‌ప‌ళంగా ఆ గోడ ప‌డిపోయింది. ఆ త‌ర్వాత మ‌రో గోడ‌ను ఆయ‌న చేత్తో తోయ‌గా అది కూడా ప‌డిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేయగా.. ఎస్పీ చీఫ్‌, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాద‌వ్ బీజేపీ స‌ర్కారుపై సెటైర్ల‌తో విరుచుకుప‌డ్డారు. బీజేపీ పాల‌నలో అవినీతి ఏ స్థాయికి చేరిందో చెప్పేందుకు ఇదే ఉదాహ‌ర‌ణ అంటూ అఖిలేశ్ అన్నారు. సిమెంట్ లేకుండా అలా ఇటుక‌లు పేర్చితే ఇలాగే జ‌రుగుతుంద‌న్నారు.