మోదీ చెప్పిన ‘మాస్క్ పెట్టుకోని ప్రధాని’ ఎవరంటే? - MicTv.in - Telugu News
mictv telugu

మోదీ చెప్పిన ‘మాస్క్ పెట్టుకోని ప్రధాని’ ఎవరంటే?

June 30, 2020

Bulgaria PM

భారత్‌లో కరోనా విజృంభిస్తున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తూ ఓ ప్రధాని గురించి ప్రస్తావించారు. లాక్‌డౌన్‌ నిబంధనల్ని అతిక్రమించిన ఓ దేశ ప్రధానే ఏకంగా రూ.13 వేలు జరిమానా కట్టారంటూ మోదీ చెప్పిన విషయం తెలిసిందే. దీంతో మోదీ చెప్పిన ఆ ప్రధాని ఎవరు? ఎందుకు జరిమానా కట్టాల్సి వచ్చింది? అనే మాటలు జోరుగా వినిపిస్తున్నాయి. యూరప్‌ ఖండంలోని బల్గేరియా దేశంలో 69,48,445 మంది జనాభా ఉండగా.. కరోనా మహమ్మారి వ్యాపించడంతో అక్కడి ప్రభుత్వం కఠిన చర్యల దిశగా అడుగులు వేస్తోంది. భౌతికదూరం, మాస్కులు, శానిటైజర్లు తప్పినసరిగా వాడాలంటూ నిబంధనలు విధించింది. ఈ నిబంధనలను పాటించనివారికి ఆరోగ్యశాఖ కఠిన శిక్షలు విధిస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల ఆ దేశ ప్రధాని బోయ్కో బొరిస్సోవ్‌కు ఆ దేశ ఆరోగ్యశాఖ అధికారులు 300 లెవ్స్ (రూ.13వేలు) జరిమానా విధించారు. 

ఆయన ఇటీవల ఓ చర్చిని సందర్శించడానికి వెళ్లారు కానీ, ముఖానికి మాస్కు ధరించలేదు. దీన్ని గుర్తించిన అధికారులు ఆయనకు భారీ జరిమానా విధించారు. ఆయనకే కాకుండా ప్రధాని వెంట వెళ్లిన కొందరు పాత్రికేయులు, ఫోటోగ్రాఫర్లు, కెమెరామెన్లకు కూడా జరిమానా విధించారు. ఆయన గురించే మోదీ ప్రస్తావించారు. బల్గేరియాలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో లాక్‌డౌన్‌ నిబంధనలను ఈ నెలలోనే సడలించింది. గత వారం 606 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,984కి చేరగా.. 207 మంది మృతిచెందారు. దీంతో కొత్త కేసులు నమోదు కావడంతో అప్రమత్తమైన అక్కడి ప్రభుత్వం బస్సులు, రైళ్లు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేసింది. కాగా, ఇటీవల అధికార గెర్బ్‌, ప్రతిపక్ష సోషలిస్టు పార్టీలు భారీ సమావేశాలు నిర్వహించింది. అయితే రెండు పార్టీలు భౌతికదూరాన్ని పాటించకపోవడంతో చెరో 3వేల లెవ్‌లు (రూ.1,30,228) చొప్పున ఫైన్ విధించారు.