మంగళసూత్రం మింగిన ఎద్దు.. కడుపు కోసి..
చిన్న పిల్లలు పొరపాటున నాణాలు మింగుతుంటారు. దొంగలు కూడా తనిఖీల నుంచి తప్పించుకోడానికి డ్రగ్స్, బంగారు బిస్కెట్లు వగైరా గుటకాయ స్వాహా చేస్తుంటారు. కానీ, అటూ పిల్లలూ కాకుండా, ఇటు దొంగలూ కాకుండా ఓ ఎద్దు ఓ ఇల్లాని మంగళసూత్రాన్ని మింగేసింది. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలో ఈ వింత జరగింది. మహారాష్ట్రలో పశువుల పండుగలను ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. పల్లె ప్రజలు తమ ఎద్దులను అందంగా అలంకరిస్తారు. తరువాత వాటిని ఇంటింటికీ తిప్పుతారు. మహిళలు వాటికి పసుపూ కుంకుమా, పూలూ పెట్టి పూజ చేస్తారు. తమ బంగారు నగలను ఆ ఎద్దు ముఖానికి తాకిస్తారు. అలా చేస్తే తమకు అదృష్టం వరిస్తుందని వారి నమ్మకం.
ఆగస్ట్ 30న ఓ గ్రామంలో ఓ ఇల్లాలు ఇంటికి వచ్చిన ఎద్దుకు పూజ చేసి తన మంగళసూత్రాన్ని ఎద్దు తలకు తాకించింది. అదే సమయంలో ఇంట్లో కరెంటు పోవడంతో మంగళసూత్రం, మరికొన్ని వస్తువులను పళ్లెంలో ఉంచి ఇంట్లోకి వెళ్లింది. కొవ్వొత్తి వెలిగించి బయటకు వచ్చేసరికి మంగళసూత్రం కనిపించకుండా పోయింది. చీకట్లో ఎవరైనా దొంగతనం చేసి ఉంటారని మొదట అనుమానించారు. కానీ, ఎద్దు కోసం చేసిన పిండి పదార్థాలు కూడా పళ్లెంలో లేవు. దీంతో మంగళసూత్రాన్ని ఎద్దు తినేసి ఉంటుందని అనుమాన పడ్డారు. అప్పటి నుంచి ఆ ఎద్దును ఇంటి దగ్గరే కట్టేసుకున్నారు. పేడ వేసిన ప్రతిసారీ తీసి పరిశీలించేవారు. ఎంత వెతికినా మంగళసూత్రం దొరకకపోవడంతో ఆ ఎద్దును ఓ వెటర్నరీ డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు. మెటల్ డిటెక్టర్ సాయంతో మంగళసూత్రం ఎద్దు కడుపులోనే ఉందని కనుగొన్నారు. సెప్టెంబర్ 8న ఎద్దుకి ఆపరేషన్ చేసి మంగళసూత్రాన్ని బయటకు తీశారు. రూ.1.5లక్షల విలువైన మంగళసూత్రం వారికి దక్కింది. ఎద్దుకు ఆపరేషన్ చేసినందుకు రూ.5000 ఖర్చయింది. రెండు నెలల పాటు ఎద్దు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని వైద్యులు సూచించారు.