సాధారణంగా ఆఫర్లను షాపింగ్ మాల్స్, ఈ కామర్స్ సంస్థలు వంటివి ఇస్తుంటాయి. కానీ చరిత్రలో తొలిసారి ఆంధ్రాలో కోడి పందేలు కాయడంపై నిర్వాహకులు బంపర్ ఆఫర్ ప్రకటిస్తున్నారు. నిర్వాహకుల మధ్య పోటీ ఎక్కువ కావడంతో పందెంరాయుళ్లను ఆకర్షించడానికి ఆఫర్ల బాట పట్టారు.
కోడిపందేల బరుల వద్ద ఈ ఆఫర్లు ప్రత్యక్షంగా కనిసిస్తున్నాయి. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలంలో నిర్వాహకులు కోడి పందేలు ఆడేవారికి బుల్లెట్ బండి, స్కూటీలను ఆఫర్లుగా ప్రకటించారు. మండలంలో రెండేళ్లుగా 6 బరులు ఉన్నాయి. వీటిలో మూడు పెద్దవే కావడంతో కౌతవరం, వేమవరం నిర్వాహకులు ఆఫర్ల వల వేస్తున్నారు. రూ. 2 లక్షల పందేలను వరుసగా ఐదుసార్లు కాస్తే రూ. 1.75 లక్షల విలువైన బుల్లెట్ బండి, రూ. 1 లక్షతో ఐదుసార్లు కాస్తే లక్ష విలువైన స్కూటీ బహుమతిగా ఇస్తామని ప్రకటించారు. అంతేకాక, ఆయా బండ్లను బరుల వద్దే ప్రదర్శనకు ఉంచి పందెంరాయుళ్లను ఆకర్షిస్తున్నారు. దీంతో ఈ విషయం స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ రకమైన ఆఫర్లను ప్రకటించడం ఇదే తొలిసారని పలువురు చర్చించుకుంటున్నారు. కాగా, కోడిపందేలపై నిషేధం ఉన్నా బహిరంగంగా జరుగుతుండడం గమనార్హం. పోలీసులు, అధికార యంత్రాంగం చూసీచూడనట్టు వ్యవహరిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.