‘కత్తి ఇవ్వమ్మా చచ్చిపోతా’ చిన్నారికి 3 కోట్ల సాయం - MicTv.in - Telugu News
mictv telugu

‘కత్తి ఇవ్వమ్మా చచ్చిపోతా’ చిన్నారికి 3 కోట్ల సాయం

February 27, 2020

Quaden Bayles.

తన శారీరక లోపాన్ని చూసి తోటి విద్యార్థులు అవమానాలకు గురిచేస్తున్నారని తీవ్ర మనస్తాపానికి గురైన ఓ చిన్నారికి సోషల్ మీడియా అండగా నిలబడింది. దాదాపు 4 లక్షల ఐదువేల రూపాయలు(దాదాపు 3. కోట్లు) పోగు చేసి సదరు బాలుడిని డిస్నీ ల్యాండ్ ట్రిప్పుకు తీసుకువెళ్తున్నారు. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌కు చెందిన క్వాడెన్‌ బేల్స్‌ అనే తొమ్మిదేళ్ల బాలుడు అచాన్రోప్లాసియాతో బాధపడుతున్నాడు. దీంతో అతను మరుగుజ్జుగా ఉన్నాడు. అతన్ని చూసి తోటి విద్యార్థులు అవహేళను చేసేవారు. ఈ వేధింపులు రోజురోజుకు మితిమీరడంతో ఓరోజు ఆత్మహత్య చేసుకోవాలని క్వాడెన్ భావించాడు. ఈ విషయాన్ని తల్లికి చెప్పాడు. ‘నేను చనిపోవాలని అనుకుంటున్నా.. లేదంటే ఎవరైనా నన్ను చంపేయండి’ అని ఏడ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోను క్వాడెన్‌ తల్లి యర్రాక తన ఫేస్‌బుక్‌ అకౌంట్‌లో షేర్‌ చేయగా.. అదికాస్తా వైరల్ అయిన విషయం తెలిసిందే. 

దీంతో క్వాడెన్‌కు అన్ని వర్గాల నుంచి మద్దతు లభించింది. ఆస్ట్రేలియా నటుడు హుగ్‌ జాక్‌మాన్‌తో పాటు ఎన్‌బీఏ ఆటగాడు ఎన్స్‌ కాంటెర్‌ క్వాడెన్‌ వంటి సెలబ్రిటీలు సైతం అతడికి అండగా నిలిచారు. క్వాడెన్‌ కోసం అమెరికా కమెడియన్‌ బ్రాడ్‌ విలియమ్సన్‌ ప్రారంభించిన గోఫండ్‌మీ పేజ్‌ ద్వారా దాదాపు 4 లక్షల డెబ్బై ఐదువేల డాలర్లు పోగుచేశారు. ఈ భారీ మొత్తాన్ని క్వాడెన్‌ తల్లికి పేజీ నిర్వాహకులు పంపారు. చిన్నారిని సంతోషపెట్టడం కోసం డిస్నీల్యాండ్‌ ట్రిప్‌ కోసం ఈ నగదును సేకరించినట్లు తెలిపారు. అయితే క్వాడెన్‌ తల్లి ఈ విరాళాన్ని.. క్వాడెన్‌ కోసం కాకుండా చారిటీ కోసం ఉపయోగిస్తున్నట్లు ఆమె సోదరి మీడియాకు తెలిపారు. ‘అవమానాలు ఎదుర్కొని ఆత్మహత్యలకు పాల్పడుతున్నవారు ఎందరో ఉన్నారు. ఇలాంటివి పునరావృతం కాకూడదు. ఇందుకోసం పనిచేస్తున్న సంస్థకు క్వాడెన్‌ డబ్బును వినియోగించాలని భావిస్తోంది’ అని ఆమె తెలిపారు.