ఇంగ్లాండు, భారత్ మధ్య మంగళవారం ఓవల్ మైదానంలో జరిగిన తొలి వన్డేలో ఇంగ్లాండు చిత్తుగా ఓడిపోయింది. ముందుగా బ్యాండింగ్ చేసిన ఇంగ్లాండ్.. 25.2 ఓవర్లలోనే 110 పరుగులు చేసి కుప్పకూలింది. కేవలం ఇంగ్లాండు కెప్టెన్ జోస్ బట్లర్ మాత్రమే (30, 32 బంతుల్లో 6×4)టాప్ స్కోర్ చేశాడు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్.. కెప్టెన్ రోహిత్ శర్మ (58 బంతుల్లో 76 పరుగులు) చేసి అజేయంగా నిలిచాడు. రోహిత్‌కు జతగా శిఖర్ ధావన్ (31) నిలకడగా రాణించి వికెట్ పడిపోకుండా జాగ్రత్తగా ఇన్నింగ్స్‌ను కాపాడాడు. దాంతో భారత్ 18.4 ఓవర్లలో ఒక్క వికెట్టు నష్టపోకుండా లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది.
ఇక, టీమిండియా స్పీడస్టర్ జస్ప్రీత్ బుమ్రా ఇంగ్లాండ్ గడ్డపై కొత్త చరిత్ర సృష్టించాడు. ఇంగ్లాండ్‌తో తొలి వన్డేలో ఆరు వికెట్లు పడగొట్టిన బుమ్రా తన కెరీర్లోనే అత్యుత్తమ గణాంకాలు(7.2-3-19-6) నమోదు చేశాడు. మ్యాచ్‌లో ఏకంగా ముగ్గురిని డకౌట్ చేశాడు. మరో ముగ్గురిని తక్కువ స్కోరుకే ఔట్ చేశాడు.
ఇక, ఇంగ్లాండ్ జట్టు.. చరిత్రలోనే మొదటిసారిగా చెత్త రికార్డును నమోదు చేసుకుంది. భారత ఫాస్ట్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీల బంతులకు బెంబేలెత్తిపోయింది. అతి తక్కువ స్కోరుకే ఆలౌట్ అవ్వటం ఇంగ్లాండ్ క్రికెట్ ప్రియులను తీవ్ర నిరాశకు గురిచేసింది. కేవలం 25.2 ఓవర్లలోనే ఆలౌట్ అయిన ఇంగ్లండ్ కేవలం 110 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత్‌పై ఇంగ్లాండ్ అతి తక్కువ స్కోరు చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.