నర్సింగ్ విద్యార్ధినికి బన్నీ ఆర్ధిక సాయం.. ప్రశంసించిన కేరళ కలెక్టర్t - MicTv.in - Telugu News
mictv telugu

నర్సింగ్ విద్యార్ధినికి బన్నీ ఆర్ధిక సాయం.. ప్రశంసించిన కేరళ కలెక్టర్t

November 11, 2022

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నాడు. ఓ పేద నర్సింగ్ విద్యార్ధిని చదువుకు అయ్యే ఖర్చును భరించడానికి ముందుకు వచ్చాడు. దీంతో జిల్లా కలెక్టర్ బన్నీని ప్రశంసించగా, ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకెళితే.. గతంలో కేరళలో భారీ వర్షాల వల్ల కొన్ని గ్రామాలు వరదల్లో కొట్టుకుపోయాయి. దీంతో వేల మంది నిరాశ్రయులయ్యారు. ముఖ్యంగా అలెప్పీ ప్రాంతం పూర్తిగా ధ్వంసమవడంతో బాధితులకు చేయూతనిచ్చేందుకు కలెక్టర్ వీఆర్ కృష్ణ తేజ ‘వీఆర్ ఫర్ అలెప్పీ’ అంటూ దాతలకు సాయం కోసం పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో అసలే ఓ కుటుంబం అనుకోని చిక్కుల్లో పడింది.

అప్పటికే వరదలతో నిరాశ్రయులవగా, దానికి తోడు కరోనా మహమ్మారికి తండ్రి బలవడంతో ఓ నర్సింగ్ విద్యార్ధిని చదువుకు ఆటంకం కలిగింది. కలెక్టర్ కొంత సాయం చేసినా.. ఆర్దిక అండ కావాల్సిన నేపథ్యంలో ఒక్క ఏడాది ఖర్చుల కోసం అల్లు అర్జున్ సాయం అడిగారు. దీనికి స్పందించిన అల్లు అర్జున్.. ఒక్క ఏడాదికి కాదు.. మొత్తం కోర్సు పూర్తయ్యేదాకా అంటే నాలుగేళ్లు ఆ విద్యార్ధిని హాస్టల్ ఫీజు భరిస్తానని, విద్యార్ధినిని దత్తత తీసుకుంటానని కలెక్టరుకు మాట ఇచ్చాడంట. ఈ విషయాన్ని కలెక్టరే ఫేస్ బుక్ లో స్వయంగా తెలుపుతూ ధన్యవాదాలు తెలపడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో అల్లు అర్జున్ ను తెలుగు ప్రజలతో పాటు కేరళ అభిమానులు కూడా మెచ్చుకుంటున్నారు. బన్నీకి కేరళలో కూడా ఫ్యాన్స్ ఉన్న విషయం తెలిసిందే. ఆయనను అక్కడ మల్లు అర్జున్ అని కూడా ముద్దుగా పిలుచుకుంటారు.