తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు ఉండే వసతి గదులు మరింత భారం కానున్నాయి. గృహాల అద్దెను టీటీడీ భారీగా పెంచింది. మధ్యతరగతి భక్తులకు అందుబాటులో ఉండే నందకం, పాంచజన్యం, కౌస్తుభం, వకుళమాత వంటి వసతి గృహాల అద్దెలు కూడా పెరిగాయి. 500, 600 రూపాయలు ఉన్న గదుల అద్దెను ఏకంగా రూ.వెయ్యికి పెంచింది టీటీడీ.
ఈ నెల 1వ తేదీ నుంచి నారాయణగిరి రెస్ట్ హౌస్‌లోని 1, 2, 3లో గదులను రూ.150 నుంచి జీఎస్టీతో కలిపి రూ.1700కు పెంచింది. నారాయణగిరి రెస్ట్‌హౌస్ 4లో ఒక్కో గది అద్దె కూడా 750 రూపాయల నుంచి 1700 రూపాయలకు పెరిగింది. ఇక కార్నర్ సూట్‌ను జీఎస్టీతో కలిపి ఏకంగా 2200 రూపాయల చేశారు. అదేవిధంగా స్పెషల్‌టైప్ కాటేజెస్‌లో గది అద్దె రూ.750 ఉండగా.. ప్రస్తుతం జీఎస్టీతో కలిపి రూ.2800 చేసింది.దీనికి తోడు గదులు అద్దెకు తీసుకునే భక్తులు డిపాజిట్ నగదు కూడా అంతే మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది.
ఇటీవల వసతి గృహాల్లో టీటీడీ ఆధునికీకరణ పనులు చేపట్టింది. ఈ సమయంలో భక్తులకు మరిన్ని సైకర్యాలను కల్పించారు. ఏసీ, గీజర్ వంటివి ఏర్పాటు చేశారు. ఈ పనుల కోసం రూ.110 కోట్లతో టెండర్లను టీటీడీ ఆహ్వానించింది. వీటి పేరుతో ఇప్పుడు భక్తులనుంచి అధికంగా అద్దెలు వసూలు చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సామాన్యులనిక కూడా వదలకుండా 500, 600 రూపాయలు ఉన్న గదుల అద్దెను ఏకంగా రూ.వెయ్యికి పెంచడంపై వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అదే విధంగా రూ.50. రూ.100 వసూలు చేసి భక్తులకు ఇచ్చే గదుల అద్దె కూడా త్వరలో పెరగనున్నట్టు సమాచారం.