Burglary at Wipro software employee house in Nagole Bandlaguda..
mictv telugu

చర్చికి వెళ్లొచ్చేసరికి ఇల్లంతా దోచుకున్నారు.. విప్రో ఎంప్లాయ్ కంప్లైంట్

September 19, 2022

సెలవురోజులను భగవంతుని సన్నిధిలో గడపాలని, మనశ్శాంతి కోసం దైవారాధన కోసం వెళ్లిన ఆ కుటుంబం.. తిరిగొచ్చేసరికి అనుకోని షాక్ తగిలింది. చర్చి నుంచి ఇంటికి చేరుకున్న వారంతా.. ఇల్లంతా గుల్లవ్వడం చూసి కంగుతిన్నారు. ఇంట్లోని బీరువాలో ఉండే బంగారు, వెండి అభరణాలు, నగదు మాయమవ్వడంతో లబోదిబో అంటున్నారు. హైదరాబాద్ లోని ఎల్‌బీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

పోలీసులు, బాధితుల వివరాల ప్రకారం.. నాగోలు బండ్లగూడలోని కేతన ఎన్‌క్లేవ్‌లో ఉండే లాలయ్య, మాదాపూర్‌లో విప్రో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. వరుసగా రెండ్రోజులు సెలవులు ఉండడంతో భార్య, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి శనివారం అబ్దుల్‌పూర్‌మెట్‌ సమీపంలోని చర్చికి వెళ్లారు. రాత్రి అక్కడ బస చేశారు. ఆదివారం ఉదయం లాలయ్య ఇంటికి వచ్చే సరికి గ్రిల్స్‌కు ఉన్న తాళం పగలగొట్టి ఉంది లోపలికెళ్లి చూడగా అల్మారా పగల గొట్టి అందులో ఉన్న 49 తులాల బంగారు ఆభరణాలు, రూ. 1 లక్ష నగదు, 8 తులాల వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు.

ఇక చేసేదేం లేక లాలయ్య వెంటనే సమీప పీఎస్ కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్‌ టీమ్, పోలీస్‌ డాగ్స్‌తో తనిఖీలు చేసి అక్కడి వేలిముద్రాలు సేకరించారు. కాలనీలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. లాలయ్య ఇంట్లో పనిచేసేవారు తరుచూ ఇంటికి వచ్చే వారిని పోలీసులు విచారిస్తున్నారు. బాధితుడు చర్చికి వెళ్లిన విషయం తెలుసుకున్న వారే చోరీ పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.