ఏపీలో బస్సు సర్వీసులు షురూ.. బారులు తీరిన ప్రయాణికులు  - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీలో బస్సు సర్వీసులు షురూ.. బారులు తీరిన ప్రయాణికులు 

May 21, 2020

hv bhm

లాక్‌డౌన్‌తో 56 రోజులుగా డిపోలకే పరిమితమైన ఏపీఎస్ ఆర్టీసీ సర్వీసులు తిరిగి ప్రారంభం అయ్యాయి. గురువారం ఉదయం 7 గంటల నుంచి ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 1,683 బస్సులు 436 మార్గాల్లో సేవలను అందిస్తున్నాయి. దీంతో ఉదయం నుంచే ప్రయాణికులు ఆయా ప్రాంతాలకు వెళ్లేందుకు బస్టాండుల వద్ద బారులు తీరారు. మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ ప్రయాణం సాగించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. 

బస్సు సర్వీసులు ప్రారంభం కావడంతో లాక్‌డౌన్‌కు ముందు చిక్కుకుపోయిన వారు, అత్యవసర ప్రయాణాలు చేయాలనుకునే వారు బస్టాండులకు చేరుకుంటున్నారు. ఆర్టీసీ అధికారులు కూడా డిపోల వద్దనే టికెట్లు ఇచ్చి ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతున్నారు. మధ్యలో టికెట్లు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. ఆన్‌లైన్ ద్వారా కూడా బుకింగ్ సౌకర్యం కల్పించారు. కరోనా సోకకుండా బస్సుల్లో సీట్లను కూడా సర్ధుబాటు చేశారు. కాగా విజయవాడ, విశాఖపట్నంలోని సిటీ సర్వీసులకు ఇంకా అనుమతి ఇవ్వలేదు. మరోవైపు 65 ఏళ్లు పైబడినవారు, పదేళ్లలోపు చిన్నారులు అత్యవసరమైతేనే ప్రయాణాలు చేయాలని అధికారులు చెబుతున్నారు.