టోక్యోలో తాగుబోతులకు ఏం చేశారో తెలుసా? - MicTv.in - Telugu News
mictv telugu

టోక్యోలో తాగుబోతులకు ఏం చేశారో తెలుసా?

December 12, 2017

తాగినోడంటే ప్రతోడికి లోకువే. కొంచెం వాసనొచ్చినా, ఇంకొంచెం అటూ ఇటూ తూలినా…ఇక వాన్ని పురుగును చూసినట్టు చూస్తరు జనం. ప్రభుత్వానికి అత్యధికంగా ఆదాయం తెచ్చిపెడుతున్న తమను టాక్స్ పేయర్స్ గా గుర్తించాలని మందుబాబులు కామెడిగా డిమాండ్ కూడా చేస్తుంటరు. కాని వాళ్లను ఎవరూ పట్టించుకోరు. అయితే  జపాన్ రాజధాని టోక్యోల మాత్రం అడగకున్నా అక్కడి ప్రభుత్వం  తాగుబోతుల కోసం ఓ పని చేసింది.  

జపాన్ వాళ్లకు పని తప్ప వేరే ధ్యాసే ఉండదు. భార్య మీద కోపమచ్చినా, బాస్ ను చూస్తే కంపరమనిపించినా  ఆఫీసులనే  ఎక్కువ సేపు పనిచేసి నిరసన తెలుపుతరు. వాళ్లకు అదో రకం తృప్తి. అలాంటి ఉద్యోగులకు ఏం చేసినా తక్కువే అనుకుంటయ్ మేనేజ్ మెంట్లు. అందుకే ప్రతీ సంవత్సరం డిసెంబర్ ల వాళ్లకు షాన్ దార్ గ దావత్ లు ఇస్తయ్.  టోక్యో ల  ఈ పార్టీలు మస్తుగ అయితుంటయి. ఆఫీస్  అయిపోంగనే మంచిబాబులు మందుబాబులుగా మారుతరు. కుత్కె దాక తాగి “ తాగర అన్న.. తాగి ఊగర అన్న” అని జపనీస్ భాషల పాడుకుంట లోకల్  రైల్ ఎక్కుతరు.   

అయితే నిషా నెత్తి మీద ఉండేసరికి దిగాల్సిన స్టేషన్ ను  మరిచిపోతరు.. అట్లాంటోళ్లంత లాస్ట్ స్టేషన్ “టకావో” ల దిగుతరు. ఆ అర్థరాత్రి ఇంటికి పోనికి ఏం లేకపోయేసరికి  స్టేషన్ లనే కాళ్లు ముడ్సుకుని పండుకుంటరు. ఈ తాగుబోతుల కష్టాలను చూసిన టోక్యో ట్రాన్స్ పోర్ట్ కంపెనీ, మందుబాబుల కోసమే స్పెషల్ గా ఓ బస్ సర్వీస్ ను నడుపుతుంది.

అర్థరాత్రి ఒంటి గంట ఐదు నిమిషాలకు టకావో స్టేషన్ నుంచి మొదలయ్యే ఈ బస్ ల అందరు తాగుబోతులే ఉంటరు. ఎవరెవరు స్టేషన్ ల దిగుడు  మరిచిపోయిన్రో వాళ్లందర్నీ మళ్లా ఆ స్టేషన్ కాడ దించుడే ఈ బస్ డ్రైవర్ డ్యూటి. నాలుగేళ్ల నుంచి ప్రతీ డిసెంబర్ ల టోక్యోల ఫుల్ ప్యాక్ తోని ఈ బస్ నడుస్తుంది. ఈ సంవత్సరం కూడా మొన్ననే మొదలయింది. అన్నట్టు ఈ మిడ్ నైట్ సర్వీస్ ల టికెట్ రేట్ మస్తు చీప్.